బాల్యమా.. భరించుమా..!
► బాల్యానికి బందిఖానాలుగా అంగన్‌వాడీ కేంద్రాలు
► ఇరుకు గదులు, సౌకర్యాలలేమితో అల్లాడుతున్న చిన్నారులు
► ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పట్టించుకోని అధికారులు, పాలకులు
ఆకు కదిలినా, కొమ్మ ఊగినా, పక్షుల కిలకిలరావాలువిన్నా..అన్నీ తమ కోసమేనని సంబరపడే చిన్నారుల బాల్యం జీవితాలు..ఇరుగు గదుల్లో , అధికారుల నిర్లక్ష్యపు పొరల్లో బందీ అవుతున్నాయి..మనో వికాసానికి మొదటి అడుగు వేయించాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు..చాలీచాలని భవనాల్లో, పరాయి వాకిళ్లలో పాట్లు పడుతున్నాయి..ఏళ్లు గడుస్తున్నా సొంత గూడు ఏర్పరుచుకోలేని ఆ శాఖ అలసత్వాన్ని.. ఆటపాటలకు దూరవవుతున్న చిన్నారుల తేనె మనసులు వెక్కిరిస్తున్నాయి.
తెనాలి రూరల్ : ఆరేళ్లలోపు చిన్నారుల వికాసానికి ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలు ఇరుకు గదుల్లో కనీస వసతులు, గాలి వెలుతురు కరువై ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 4405 అంగన్‌వాడీ కేంద్రాలకుగాను 665 సొంత భవనాల్లో నడుస్తున్నాయి. 3740 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఈ కేంద్రాల్లో 3, 38, 722 మంది చిన్నారులు ఉన్నారు.
సదుపాయాలు లేమి
అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు సూచించింది. అన్ని సదుపాయాలున్న సొంత భవనం ఉండాలి. లేకుంటే మూడు గదులున్న భవనాన్ని అద్దెకు తీసుకోవాలి. పిల్లలు ఆడుకునేందుకు 500 నుంచి 700 గజాల విస్తీర్ణంలో విశాలమైన ఆట స్థలం ఉండాలి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం వీటికి భిన్నంగా ఉంది. అధిక శాతం కేంద్రాలు అద్దె భవనాలు, చావిడిలు, ఇరుకు గదుల్లోనే కొనసాగుతున్నాయి. ఎక్కువ కేంద్రాలకు కనీసం మరుగుదొడ్డి వసతి లేదు.
ప్రభత్వం అరకొర అద్దెలు చెల్లిస్తుండడంతో సరైన భవనాలు దొరకడం లేదు. అర్బన్ ఏరియాల్లో రూ. 3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 750 మాత్రమే ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం రూ. 3 వేలు అద్దె చెల్లిస్తేనే మూడు గదులున్న భవనం అద్దెకు దొరుకుతుంది. ప్రస్తుతం 50 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న గదిలోనే కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అదే గదిలో వంట చేస్తున్నారు. చిన్నారులకూ అక్కడే విద్య నేర్పిస్తున్నారు.
విద్యార్థుల తగ్గుముఖం
కనీస వసతులు లేని చోటకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు సందేహిస్తున్నారు. ఇరుకు గదులు, కొన్ని చోట్ల పెచ్చులూడుతున్న శ్లాబులతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేయాల్సి ఉన్నా, ఇప్పటికీ పూర్తి స్థాయిలే అందలేదు. ఎండల కారణంగా తల్లిదండ్రులు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపేందుకు ఆసక్తి చూపడం లేదని, దీంతో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని పేరు చెప్పేందుకు ఇష్టపడని కార్యకర్త ఒకరు చెప్పారు. జిల్లాలో 55 అంగన్‌వాడీ పోస్టులు ఖాళీ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇబ్బందే..తప్పడం లేదు
ఈ ఏడాది నాబార్డ్, ఏపీఐపీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల కేటాయింపు ఉండే అవకాశముంది. స్థలం కేటాయిస్తే భవనాల నిర్మాణం సాధ్యమవుతుంది. ఇరుకుగా ఉన్నా కొన్ని చోట్ల కేంద్రాల నిర్వహణ తప్పడం లేదు. తక్కువ సంఖ్య విద్యార్థులున్న రెండు అంగన్‌వాడీ కేంద్రాలను ఒక్కటిగా కలిపి నాణ్యమైన సేవలు అందిస్తాం. ఒకటో తేదీ నుంచి ఇంటింటికీ అంగన్‌వాడీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం.
- శైలజ, సీడీపీఓ, తెనాలి