పీడీకి సమ్మె నోటీసు అందిస్తున్న అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు
ఒంగోలు టౌన్: అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 19వ తేదీ చలో విజయవాడ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి అంగన్‌వాడీలు చలో విజయవాడలో పాల్గొనేందుకుగాను ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాళ్లు గురువారం సాయంత్రం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సరోజినిని కలిసి ఒకరోజు సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్‌వాడీలకు రూ.18 వేల చొప్పున వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.2 లక్షలు, ఆయాకు లక్ష రూపాయల చొప్పున గ్రాట్యుటీ ఇవ్వాలని కోరారు.
ఉద్యోగ విరమణ చేసే సమయంలో అంగన్‌వాడీలు అందుకున్న చివరి నెల వేతనాన్ని పెన్షన్‌గా నిర్ణయించి ప్రతినెలా ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు సంబంధించిన బయోమెట్రిక్ హాజరు విధానాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీలకు ఐసీడీఎస్‌తో సంబంధంలేని బీఎల్‌ఓ, పలకరింపు, స్మార్ట్ పల్స్ సర్వే వంటి విధులు అప్పగించరాదన్నారు. పీడీని కలిసి సమ్మె నోటీసు అందజేసిన వారిలో యూనియన్ నాయకురాళ్లు కేవీ సుబ్బమ్మ, ఉమాదేవి, ధనలక్ష్మి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment