
అద్దె భవనంలో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రం
సాక్షి, విజయనగరం : అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణంలో గత టీడీపీ ప్రభుత్వం అలసత్వం చూపింది. చిన్నారులు, కార్యకర్తలు, ఆయాలను కష్టాల్లోకి నెట్టింది. నాటి నిర్లక్ష్యం ఫలితంగా భవన నిర్మాణాలు ప్రారంభించి మూడేళ్లు గడిచినా సగం నిర్మాణాలు పూర్తికాలేదు. 111 భవనాలకు అసలు పునాది రాయికూడా వేయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భవనాలు మంజూరైనా అంగన్‌వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది.
నిర్మాణాలకు దూరంగా...
2016 –17 సంవత్సరంలో 596 అంగన్‌వాడీ కేంద్రాలకు, 2018–19లో 349 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు మంజూరయ్యాయి. మొత్తంగా 945 భవనాలు మంజూరుకాగా వీటిలో కేవలం 411 భవనాల పనులు మాత్రమే పూర్తయ్యాయి. 111 భవనా లకు ఇంకా పునాది రాయి కూడా వేయలేదు. అయితే, ప్రస్తుతం భవనాలు మంజూరై కూడా నిర్మాణం పూర్తికాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇరుకు గదులు, సరైన వసతులు లేనిఅద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు.
ఒక్కో భవనానికి రూ.7.50 లక్షలు..
ఒక్కో భవనానికి రూ.7.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. భవన నిర్మాణం 600 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించాలి. కిచెన్, స్టోర్ రూమ్, హాల్, మరుగుదొడ్డి నిర్మించాలి. రూ.7.50 లక్షల్లో రూ.5 లక్షలు ఉపాధిహామి నిధులు, రెండు లక్షలు ఐసీడీఎస్ శాఖ, పంచాయతీ నుంచి రూ.50 వేలు మంజూరు చేస్తారు. జిల్లాలో 2,977 అంగన్‌వాడీ కేంద్రాలు, 745 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వెయ్యి కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 700 కేంద్రాలు సామాజిక భవనాల్లో నడుస్తున్నాయి. మిగిలిన కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. గ్రామీ ణ ప్రాంతాల్లో రూ.750, పట్టణ కేంద్రాల్లో రూ.3వేలు చొప్పున ప్రస్తుతం అద్దె చెల్లిస్తున్నారు. అద్దె కేంద్రాలు కూడా విశాలంగా లేకపోవడంతో పిల్లల ఆటపాటలకు ఇబ్బందిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment