సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం (2014-15) రాష్ట్ర వార్షిక ప్రణాళిక భారీగా పెరగనుంది. 66 కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికే ఇచ్చే నిధులను రాష్ట్ర వార్షిక ప్రణాళిక కిందకు తేవడమే ఇందుకు ప్రధాన కారణం. గత ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రాష్ట్ర వార్షిక ప్రణాళిలో కాకుండా విడిగా పొందుపరుస్తున్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కూడా రాష్ట్ర వార్షిక ప్రణాళిక కిందకు తీసుకొస్తున్నట్టు కేంద్ర ప్రణాళికా సంఘం పేర్కొంది.
పస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఎన్ని నిధులు కేటాయిం చారో, అంతే మేర వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికలో పొందుపరచాలని స్పష్టం చేసింది. దీని వల్ల రాష్ట్ర వార్షిక ప్రణాళిక ఏకంగా రూ.20 వేల కోట్ల మేర పెరగనుంది. మరోవైపు ప్రభుత్వం అందించే అన్ని రకాల సేవలకయ్యే మొత్తం వ్యయాన్ని యూజర్ చార్జీల ద్వారా రాబట్టాలని ప్రణాళికా సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సాగు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, కరెంట్ సరఫరా, రవాణా తదితర రంగాల చార్జీలను సవరించడం ద్వారా ప్రణాళికేతర వ్యయాన్ని రాబట్టాలని పేర్కొంది.
పన్నేతర ఆదాయం పెంపుపై ఎక్కువ దృష్టి సారించాలని సూచించింది. కనీసం సాగునీటి రంగం నిర్వహణ వ్యయాన్ని అయినా సరే పన్నేతర ఆదాయం ద్వారా రాబట్టాలని స్పష్టం చేసింది. నిర్ధారించిన నమూనా పత్రాల్లో అంచనా వివరాలను ఈ నెల 10వ తేదీలోగా పంపించాలని సూచించింది. రాష్ట్ర వార్షిక ప్రణాళికపై వచ్చే ఏడాది జనవరి 15 నుంచి రాష్ట్ర అధికారుల స్థాయిలో ప్రణాళికా సంఘం చర్చలు ప్రారంభించనుంది.
మార్గదర్శక సూత్రాలివీ...
భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీటి చార్జీల ఆదాయంతో పాటు ఆ ప్రాజెక్టుల నిర్వహణకు వెచ్చిస్తున్న వ్యయాన్ని వేర్వేరుగా పొందుపర్చాలి. అలాగే విద్యుత్ సరఫరా, రవాణా రంగాల ద్వారా చార్జీల రూపంలో వస్తున్న ఆదాయాన్ని వేర్వేరుగా పేర్కొనాలి.
కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి వచ్చే వాటాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పేర్కొన్న మొత్తాన్నే వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా పేర్కొనాలి.
సొంత పన్నుల ఆదాయం ఎంత చూపెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం, అయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి వద్ధి రేటు కన్నా తక్కువగా సొంత పన్నుల ఆదాయం ఉండరాదు. సాధారణ వద్ధి రేటుతో రాష్ట్ర పన్నుల ఆదాయం పెరుగుదలను విడిగాను, పన్ను పెంచడం ద్వారా అదనపు ఆదాయం వస్తుంటే ఆ వివరాలను విడిగాను నమూనా పత్రాల్లో వివరించాలి.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఆధారంగా వచ్చే (2014-15) వార్షిక ప్రణాళికకు వనరులను అంచనా వేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్పరం ప్రణాళికలో ఇప్పటి వరకు అయిన వ్యయం, ఆదాయం స్థితిగతుల ఆధారంగా వచ్చే వార్షిక ప్రణాళికకు వనరులను లెక్కగట్టాలి. రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టానికి లోబడి అప్పు, రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చే నిధుల ఆధారంగా వార్షిక ప్రణాళికకు వనరులను అంచనా వేయాలి.
ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పించనుకు సంబంధించి రెండు విడతల కరువు భత్యం ఆధారంగా అంచనాలను పొందుపరచాలి. ఉద్యోగులకు సంబంధించి నెల వారీ మొత్తం వేతనాలు ఎంతనే వివరాలను విడిగా పేర్కొనాలి.
విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీల పెంపుదల ఉంటే ఆ విషయాన్ని ప్రత్యేకంగా అదనపు ఆదాయ వనరులుగా పొందుపరచాలి. వీలైనంత ఎక్కువ మేర పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా నిర్వహణ వ్యయాన్ని రాబట్టాలి.
పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి అంతర్గత ఆదాయ వివరాలను, అప్పులను, బడ్జెట్ మద్దతును వేర్వేరు నమూనాల్లో పొందుపరచాలి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పేర్కొన్న మేరకే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా బహిరంగ మార్కెట్ రుణాలను పరిమితం చేయాలి.
విదేశీ పథకాలకు సంబంధించిన సాయాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇస్తున్న మేరకే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించాలి. అయితే ఈ పథకాలకు గత ఆర్థిక సంవత్సరంలో అయిన వ్యయంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు చేసిన వ్యయాలను ప్రత్యేకంగా పేర్కొంటూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదనలు చేయాలి.
భారీగా వార్షిక ప్రణాళిక!
Published Mon, Dec 9 2013 1:05 AM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM
Advertisement
Advertisement