పెద్దలకే ‘చంద్రన్న కానుక’! | Another Golmal in chandranna kanuka tenders | Sakshi
Sakshi News home page

పెద్దలకే ‘చంద్రన్న కానుక’!

Published Sat, Dec 16 2017 3:38 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

Another Golmal in chandranna kanuka tenders - Sakshi

సాక్షి, అమరావతి/ విశాఖపట్నం
సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు పేదల చేతుల్లో పప్పు, బెల్లాలు పెడుతూ పెద్దలు మాత్రం కోట్లు నొక్కేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఉచితంగా పంపిణీ చేయనున్న ‘చంద్రన్న కానుక’ టెండర్ల దశలోనే గోల్‌మాల్‌ జరిగింది. తమ జేబులు నింపుకునేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు నిబంధనలనే మార్చేశారు. చిన్న వ్యాపారులు టెండర్లలో పాల్గొనడానికి అవకాశం లేకుండా చేసేశారు. భారీగా ముడుపులు ఇచ్చేవారికి అనుకూలంగా నిబంధనలు రూపొందించారు. గతంలో 5 నుంచి 10% కమీషన్లతో హోల్‌సేల్‌ వ్యాపారులకు ఈ కాంట్రాక్టులు కట్టబెట్టేవారు. ఆ కమీషన్‌ సరిపోక ఈసారి చిన్న ట్రేడర్స్‌ను తప్పించి బడా పారిశ్రామికవేత్తలకు టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందించారు. అది చాలదన్నట్లు మార్కెట్‌ రేటు కంటే అధికంగా కోట్‌ చేయించి మరీ వారికి కాంట్రాక్టులు అప్పజెబుతున్నారు. తద్వారా రూ.80 కోట్లకు పైగా ప్రజాధనం లూటీ చేస్తున్నారని పౌరసరఫరాల శాఖలో వినిపిస్తోంది.

ఇదీ స్కీమ్‌..
చంద్రన్న కానుక పేరిట రాష్ట్రంలో ఉన్న 1.42 కోట్ల తెల్ల రేషన్‌ కార్డులున్న పేదలకు కొన్ని వస్తువులను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఒక్కో లబ్ధిదారుడికి అర కిలో బెల్లం, అర కిలో శెనగపప్పు, కిలో గోధుమపిండి, అర లీటర్‌ పామాయిల్, 100 గ్రాముల నెయ్యి ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందుకోసం 7,115 మెట్రిక్‌ టన్నుల శనగపప్పు, 7,115 మెట్రిక్‌ టన్నుల బెల్లం, 14,230 మెట్రిక్‌ టన్నుల గోధుమ పిండి, 7,115 కిలో లీటర్ల పామాయిల్, 1,432 కిలో లీటర్ల నెయ్యి అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. వీటిని సేకరించేందుకు పౌరసరఫరాల సంస్థ ఇటీవల టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలను నాలుగు జోన్లుగా విధించి ఆ మేరకు సరఫరా చేయాలని టెండరు నిబంధనల్లో పేర్కొన్నారు.

నిబంధనలు మార్చి బడా సంస్థలకు రెడ్‌కార్పెట్‌
గతేడాది రూ.ఐదు కోట్ల టర్నోవర్‌ చేసే వ్యాపారికి బెల్లం, రూ.10 కోట్ల టర్నోవర్‌ చేసే ట్రేడర్స్‌కు ఇతర సరుకుల టెండర్లను ఖరారు చేసేవారు. కానీ ఈ ఏడాది ఆ ట్రేడర్స్‌ను కాదని మొత్తం టెండర్లన్నీ బడాబాబులకు కట్టబెట్టారు. ఈసారి రూ.50 కోట్ల టర్నోవర్‌ చేసే సంస్థ నెయ్యి, రూ.30 కోట్ల టర్నోవర్‌ చేసే సంస్థలు మాత్రమే సరుకుల టెండర్లలో పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొంటూ టెండర్‌ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. అలాగే తమ వద్ద ఉన్న శెనగలు, కందులను మిల్లింగ్‌ చేయడం ద్వారా 100 కిలోలకు 64 కిలోల చొప్పున మిల్లింగ్‌కు ఇచ్చేందుకు వీలుగా టెండర్‌ పిలిచారు. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ఈ నెల 11వ తేదీన పిలిచిన ఈ టెండర్లన్నీ దాదాపు ఖరారయ్యాయని, భారీగా ముడుపులు ఇచ్చే బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని తెలిసింది. కందులు, శెనగలు వంద కిలోలు మిల్లింగ్‌ చేస్తే 75 కేజీల వరకు వస్తాయి. కానీ 64 కిలోలు ఇస్తే సరిపోతుందని టెండర్‌లో వెసులుబాటు ఇవ్వడం వెనుక కూడా భారీగానే ముడుపులు చేతులు మారాయని సమాచారం. ఇతర సరుకుల విషయంలో కూడా బహిరంగ మార్కెట్‌ కన్నా అధిక ధరకు టెండర్లు పిలవడం ద్వారా భారీగా ముడుపులు తీసుకున్నారని తెలుస్తోంది.

అన్ని టెండర్లు రాష్ట్రేతర సంస్థలకే...
రూ.30 కోట్ల నుంచి రూ.50కోట్ల టర్నోవర్‌ చేసేవారు మాత్రమే టెండర్లలో పాల్గొనేలా మార్పులు చేయడంతో రాష్ట్ర పరిధిలోని ట్రేడర్స్‌ ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. దాదాపు టెండర్లన్నీ హైదరాబాద్, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన ఇండస్ట్రీస్‌ దక్కించుకున్నాయి. నెయ్యి కిలో రూ.450లకు కోట్‌ చేసిన కోసం గుజరాత్‌కు చెందిన ఎస్‌డీపీ ఇండస్ట్రీస్‌కు, గోధుమ పిండి రూ.38.50కు కోట్‌ చేసిన హైదరాబాద్‌కు చెందిన క్లారియన్‌ ఆగ్రోకు, బెల్లం టెండర్‌ను రూ.49లకు కోట్‌ చేసిన గుజరాత్‌కు చెందిన మిలాప్‌ ఎంటర్‌ప్రై జెస్‌ దక్కించుకోగా, కందులు, శెనగలు మిల్లింగ్‌ ఆడించే టెండర్‌ మహారాష్ట్రకు చెందిన సోనూమోనో కంపెనీకి కట్టబెట్టారు.

ఇక పామాయిల్‌ సరఫరా కిలో రూ.69ల చొప్పున కోట్‌ చేసిన కాకినాడకు చెందిన సంతోషీమాత ఆయిల్స్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలాజీ గ్రౌండ్‌నట్‌ ఆయిల్స్‌ దక్కించుకున్నాయి. పామాయిల్‌ ధర మార్కెట్‌లో రూ.61లు ఉండగా... టెండర్‌ను రూ.69లకు కట్టబెట్టారు. ఆ తర్వాత 20 శాతం డ్యూటీ పెరిగిందన్న సాకుతో మరో రూ.7లు పెంచాలని టెండర్‌ దక్కించుకున్న సంతోషిమాత, బాలాజీ గ్రౌండ్‌నట్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మరోవైపు జ్యూట్‌ సంచులను కూడా మహారాష్ట్ర, హైదరాబాద్‌ కంపెనీలకే ఖరారు చేశారు.

 ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఈ సరుకుల రేట్లను బట్టి చూస్తే రూ.370 కోట్లకే వచ్చే ఈ సరుకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏకంగా రూ.450 కోట్లను ఖర్చు చేస్తోంది. గతేడాది ఇదే సరుకులను సుమారు 360 కోట్లకే టెండర్లు ఫైనలైజ్‌ అయ్యాయి. కానీ ఈసారి ఏకంగా రూ.450 కోట్లకు టెండర్లు ఖరారు చేయనుండడంతో రూ.80 కోట్లకు పైగా పక్కదారి పట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సొమ్ములు సరిపోవంటూ ఎప్పటిలాగే 10 శాతం కమీషన్‌ కోసం ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలియవచ్చింది. కమీషన్‌ విషయం కొలిక్కి వస్తే రెండు మూడు రోజుల్లో వర్క్‌ ఆర్డర్స్‌ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అనకాపల్లి బెల్లం వ్యాపారులకు అన్యాయం
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్‌ దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. అనకాపల్లి బెల్లం వ్యాపారులు గత ఏడాది టెండర్లలో పాల్గొని బెల్లంసరఫరా చేశారు. దీనివల్ల విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో చెరుకు పండించే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వ్యాపారులు, కూలీలు కూడా కొంతవరకు ప్రయోజనం పొందారు. ఈ ఏడాది రూ.30 కోట్లకు పైబడి టర్నోవర్‌ ఉన్నవారు మాత్రమే టెండర్లలో పాల్గొనేందుకు అర్హులని నిబంధన విధించారు. అంటే ఒక్కసారిగా ఆరు రెట్లు పెంచేశారన్నమాట. అధిక టర్నోవర్‌ నిబంధన తొలగించి తమకు న్యాయం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అనకాపల్లి వ్యాపారులు విజ్ఞప్తి చేసినా ఉపయోగం లేకపోయింది.

మహారాష్ట్ర మిల్లర్‌తో ముందస్తు ఒప్పందం
టెండర్‌ మీకు దక్కేలా చూస్తాం...సరుకు రవాణాకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోండి...ఇలా ఒక కాంట్రాక్టర్‌కు నేరుగా సీఎంఓలో పని చేసే ఒక అధికారి హామీ ఇచ్చి దానిని నెరవేర్చడం పౌరసరఫరాల సంస్థలో చర్చనీయాంశంగా మారింది. చంద్రన్న కానుక సరుకులలో భాగమైన కందిపప్పు సరఫరాకు సంబంధించిన టెండర్‌ను మహారాష్ట్రకు చెందిన ఒక కాంట్రాక్టర్‌ దక్కించుకున్నారు. ఇలా టెండర్‌ పూర్తయిందో లేదో ఆ కాంట్రాక్టర్‌ అలా రేషన్‌ షాపులకు చకచకా కందిపప్పును సరఫరా చేసేశారు. అధికారుల నుంచి ముందుగా సమాచారం ఉండడం వల్లే ఆ కాంట్రాక్టర్‌ అంత వేగంగా కందిపప్పును సరఫరా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆరోపణల్లో వాస్తవం లేదు: పౌరసరఫరాల ఎండీ
చంద్రన్న కానుక సరుకుల సరఫరాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పౌరసరఫరాల సంస్థ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.రాంగోపాల్‌ తెలిపారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. టెండర్లలో కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదని, నియమనిబంధనల ప్రకారమే కాంట్రాక్టర్లకు అప్పగించామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement