=8, 15 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్
=అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌వోలు దరఖాస్తుల స్వీకరణ
=మొబైల్ రిజిస్ట్రేషన్ బృందం ఏర్పాటు
=యువతపై ప్రత్యేక దృష్టి
=కొత్త వారికి ఏటీఎం తరహా కార్డులు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలంటే నమోదుకు ఇదే చివరి అవకాశమని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటరు నమోదు చేయించుకునే విధంగా ఈ నెల 8, 15 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరులతో జేసీ మాట్లాడుతూ గత నెల 18న ఓటరు జాబితా ముసాయిదాను ప్రచురించామన్నారు. రెండు వారాల్లో 26,851 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయా తేదీల్లో బూత్ లెవెల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని, ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరిస్తార న్నారు.
ఈ నెల 8,15 తేదీల్లో జరిగే డ్రైవ్‌లో ఎక్కడైనా పోలింగ్ కేంద్రాలు తెరవకపోయినా, నమోదు ఫారాలు లేకపోయినా సంబంధిత తహశీల్దార్‌కు లేదా డిప్యూటీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కొత్తగా నమోదు ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 69 వేల దరఖాస్తులు రాగా అందులో 10 వేల మందికి సంబంధించి నమో దు ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. జిల్లాలో 47 వేల డూప్లికేట్ కార్డులు ఉన్నట్లు గుర్తించామని, వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు.
మొబైల్ రిజిస్ట్రేషన్ బృందం
జిల్లా జనాభా గణాంకాల ప్రకారం ఇంకా 1.70 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేయించుకోవాల్సి ఉందని జేసీ తెలిపారు. నియోజకవర్గాలు, మండలాల్లో జనాభా ఆధారంగా నమోదు తక్కువున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో మొబైల్ రిజిస్ట్రేషన్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఇప్పటికే కళాశాలల్లో సమావేశాలు నిర్వహించి ఓటరుగా నమోదు కాని వారిని గుర్తించే బాధ్యతలను ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు అప్పగించామని వెల్లడించారు.
అవసరమైతే అధికంగా ఓటర్లు ఉన్నట్లు గుర్తించిన కళాశాలకు మొబైల్ బృందాన్ని పంపి నమోదు ప్రక్రియను చేపడతామన్నారు. ప్రధానంగా పాడేరు ఏజెన్సీలో ఓటరు నమోదు శాతం తక్కువగా ఉందని, అక్కడ నమోదు శాతం పెంపునకు చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ పార్టీలు కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకొని ఓటరు నమోదుకు సహకరించాలని,ఎన్నికల సమయంలో ఓట్లు లేవని, గల్లంతయ్యాయని ఇబ్బందులు పడే కంటే ఇప్పుడే సరిచూసుకోవడం మంచిదన్నారు.
డిసెంబర్ 17వ తేదీ వరకు ఓటరు నమోదు,సవరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కొత్తగా ఓటరు నమోదు చేసుకున్న వారికి పాత కార్డుల మాదిరిగా కాకుండా ఏటీఎం కార్డుల తరహాలో కొత్తగా ఓటరు కార్డులు వస్తాయని పేర్కొన్నారు.
ఓటరు నమోదుకు మరో అవకాశం
Published Sun, Dec 8 2013 2:24 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement