=తూతూ మంత్రంగా ఓటరు నమోదు ప్రచారం
=వేళకు రాని అధికారులు
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: గ్రేటర్‌లో ఓటరు నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమం మొక్కుబడి తంతుగా ముగిసింది. సిబ్బంది ఉంటే దరఖాస్తులు లేని కేంద్రాలు కొన్ని.. సంబంధిత ఫారాలు ఉన్నప్పటికీ.. ఎలా భర్తీ చేయాలో వివరించే సిబ్బంది లేని కేంద్రాలు ఇంకొన్ని.. మూతపడిన పోలింగ్ కేంద్రాలు మరికొన్ని.. అవగాహన లేని అంగన్‌వాడీ టీచర్లతో ఫారాల భర్తీలో ప్రజలు అవస్థలు.. పలుచోట్ల ప్రచారం లేక వెలవెలబోయిన కేంద్రాలు.. వెరసి ఓట్ల నమోదుకు పక్కా ఏర్పాట్లు చేయడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారు. దీంతో ఓటు ప్రచారం కాస్త ప్రహసనంగా మారింది.
పద్దెనిమిదేళ్లు నిండిన వారందరినీ ఓటర్ల జాబితాలో చే ర్చేందుకు ఏడాది పొడవునా పేర్ల నమోదుకు అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా ఈ నెల 24, వచ్చేనెల 1, 8 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రజల సౌకర్యార్థం వరుసగా మూడు ఆదివారాలు ఈ కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తొలి ఆదివారంనాటి ప్రచార కార్యక్రమం ప్లాఫ్ అయింది. తగినంత ప్రచారం లేనందున చాలా తక్కువమంది మాత్రమే ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లినవారికి సైతం తగిన ప్రయోజనం కలగలేదు.
కేంద్రాలను ఉదయం 10.30 గంటలకే తెరవాల్సి ఉన్నప్పటికీ చాలా కేంద్రాలు మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరచుకోలేదు. అంతేకాదు సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సిన కేంద్రాలు చాలా చోట్ల మధ్యాహ్నం 3 గంటలకే మూతపడ్డాయి. మొత్తానికి మమ అనిపించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఆయా పోలింగ్ కేంద్రాల్లో ‘న్యూస్‌లైన్ విజిట్’ సందర్భంగా కనిపించిన దృశ్యాల్లో మచ్చుకు కొన్ని...
ఛత్రినాకలోని శాంతినికేతన్ పాఠశాలలో ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ.. చిరునామా మార్పిడికి అవసరమైన ఫారం-8, ఫారం-8ఏలు లేవు. దీంతో ప్రజలు ఉసూరంటూ వెనుదిరిగారు.
సత్యానగర్ కమ్యూనిటీ హాల్‌లోని పోలింగ్ కేంద్రానికి ఆశీర్వాదం అనే అంగన్‌వాడి టీచర్ 11.50 గంటల వరకు రాలేదు. కేంద్రం అడ్రస్ తెలియనందున ఆలస్యమైందని వివరణ ఇచ్చారు.
నల్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కేంద్రం తాళాలే తెరుచుకోలేదు. వి చారిస్తే నందిని అనే అంగన్‌వాడి టీచర్‌ను ఆ కేంద్రంలో నియమించగా, ఆమె జ్యోతిబాలమందిర్ స్కూల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రం లో ఎవరూ లేకపోవడంతో ప్రజలు వెనుదిరిగారు.
రాంనగర్ డివిజన్ జెమినీకాలనీ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో నిర్మల అనే అంగన్‌వాడీ టీచర్ కేంద్రాన్ని వదిలి పెట్టి కార్పొరేటర్‌ను కలవడానికి వెళ్లారు. దాంతో స్వచ్ఛందసంస్థలకు చెందినవారే అక్కడకు వచ్చిన వారికి దరఖాస్తులు, సూచనలు ఇవ్వడం కనిపించింది.
గోల్కొండ చౌరస్తాలోని ఎంబీ హైస్కూల్‌లో నాలుగు పోలింగ్ బూత్‌ల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఒక్కటి కూడా తెరుచుకోలేదు.
ఖిల్వత్ కమ్యూనిటీ హాల్‌లోని పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లాలనుకున్నవారికి నిరాశే ఎదురైంది. కమ్యూనిటీ హాల్ తాళాలు తీసేవారే కరువవడంతో అక్కడకు చేరుకున్న బీఎల్‌ఓలు.. తాము వెంట తెచ్చుకున్న ఫారాలతో బయటే ఉండిపోయారు.
కందికల్‌గేట్ ద గ్గరి పాఠశాలలో ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు బీఎల్‌ఓలెవరూ కనిపించలేదు. ఓటరు నమోదు ఫారాలను మాత్రం పాఠశాలలో ఉంచి వెళ్లిపోయారు. ఓటరు నమోదు ఫారాల భర్తీ.. చిరునామా మార్పులు తదితర అవసరాల కోసం వచ్చిన వారు నిస్సహాయంగా వెనుదిరిగారు.
కాచిగూడ డివిజన్ పరిధిలో ఫ్యూనీపాల్ స్కూల్ తాళం వేసి ఉండటంతో గేటు ముందర సిబ్బంది రెండు కుర్చీలు వేసుకుని ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. లాల్ బహదూర్ హైస్కూల్‌లో సెంటర్ తెరచుకోలేదు. బర్కత్‌పుర డివిజన్‌లో స త్యానగర్ కమ్యూనిటీహాల్ సెంటర్‌దీ అదే పరిస్థితి.
మోండా ఇస్లామియా ప్రభుత్వ పాఠశాల నల్లగుట్ట ఓల్డ్ ప్రాథమిక పాఠశాలలో సాయంత్రం 4 గంటలకే అధికారులు కేంద్రాలను వదలి వెళ్లిపోయారు. మార్కెట్ స్కూల్, కళాసీగూడ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి.
టోలీచౌకీ, నానల్‌నగర్ డివిజన్‌లకు సంబంధించిన సుమారు 70 పోలింగ్ స్టేషన్లలో కేవలం 12 కేంద్రాలలో మాత్రమే సిబ్బంది విధులు నిర్వహించారు. వీరిలో చాలామంది మధ్యాహ్నం 2 నుంచి కేంద్రాలను మూసేసి వెళ్లిపోయారు.
ఎల్‌బీనగర్ సర్కిల్ పరిధిలోని డివిజన్లలో ఓటింగ్ నమోదు కార్యక్రమం తూతూ మంత్రంగా నడిచింది. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మన్సూరాబాద్, రామక్రిష్ణాపురం, కొత్తపేట, సరూర్‌నగర్ డివిజన్ల లో ఓటింగ్ నమోదు కేంద్రాలలో బూత్‌లెవల్ అధికారులు లేక ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కోన్నారు.
ప్రచార కార్యక్రమం తీరిదీ...
రాంనగర్ డివిజన్ బాకారం గ్రంథాలయంలోని 133, 134 పోలింగ్ బూత్‌లకు సూర్యకుమారి, సీహెచ్ హరితలు బీఎల్‌ఓలుగా ఉన్నారు. ఉదయం 10.30 గంటలకే కేంద్రాలు తెరవాల్సి ఉన్నా.. 11 గంటల వరకు తెరవలేదు. దీంతో ముషీరాబాద్ ‘న్యూస్‌లైన్’ ప్రతినిధి అధికారులిచ్చిన సమాచారం ఆధారంగా వారి నంబర్లకు ఫోన్ చేశారు. ఫోన్ రిసీవ్ చేసుకున్న ఓ వ్యక్తి మేం నాగోల్‌లో ఉంటామని, హరిత ఓ సెల్‌ఫోన్ స్టోర్‌లో పని చేస్తుందని చెప్పారు. బాకారంలో ఎన్నికల డ్యూటీ ఏంటని, మీరు చెప్పేది వింతగా ఉందని చెప్పుకొచ్చారు. అలాగే సూర్యకుమారి నంబర్‌కు ఫోన్ చేయగా 9 నెలలుగా ఆమె నగరంలో లేరని, పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదీ ఓటర్ల నమోదు కోసం ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమం తీరు.
సమయపాలనేదీ?
అడిక్‌మెట్ డివిజన్‌లో 181 నుంచి 212 వరకు 32 బూత్‌లకు గాను 32 మంది ఇన్‌చార్జ్‌లను నియమించారు. అందులో ఒక్కరూ సమయానికి రాలేదు. ఏడెనిమిది మందికి ఫోన్ చేస్తే అందరూ తమకు సమాచారం లేదని సెలవిచ్చారు. అధికారులకు ఫోన్‌చేస్తే వస్తున్నామని చెప్పారు. వచ్చినవారికి సైతం సరైన అవగాహన లేదు. - ఎంసీ మోహన్,
బీజేపీ అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్షుడు
దరఖాస్తు చేసుకున్నా ఓటు రాలేదు
2010 నుంచి ఇప్పటివరకు మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నా. అయినా ఇంతవరకు ఓటుహక్కు రాలేదు. జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వెళితే సరైన సమాధానం చెప్పేవారే లేరు. ఇక్కడేమైనా సమస్య పరిష్కారం అవుతుందేమోనని వచ్చాను. ఇక్కడ కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.
- టి. చంద్రప్రకాశ్, దయానంద్‌నగర్