పురిటినొప్పులు
గర్భిణులు.. బాలింతల అవస్థలు
దెందులూరు, న్యూస్‌లైన్:
గర్భిణులు, బాలింతలు ఎక్కువ దూరం నడవకూడదు. నేలపై కూర్చోకూడదు. వైద్యులే కాదు.. సామాన్య ప్రజలకు సైతం ఈ విషయం బాగా తెలుసు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలుసో లేదో తెలియదు గాని వాళ్లను ఎక్కువ దూరం నడిపిస్తున్నారు. కటిక నేలపైనే కూర్చోబెడుతున్నారు. గర్భిణులు, బాలింతలకు భరోసా ఇవ్వాల్సిన అమృత హస్తం పథకం వారిపాలిట శాపంగా పరిణమించింది. జిల్లాలోని బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, పోలవరం, భీమడోలు, దెందులూరు, ద్వారకాతిరుమల, చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టి.నర్సాపురం మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇందిరమ్మ అమృతహస్తం పథకం అమల్లోకి ఉంది. క్షేత్రస్థారుులో 888మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 860 మంది ఆయాలు, 885 మంది గ్రామ సమాఖ్య సభ్యులు (వీవో) ఈ పథకం అమలు బాధ్యతలను చూస్తున్నారు. ఆయూ కేంద్రాల పరిధిలో నిరుపేద కుటుంబాలకు చెందిన 4,310 మంది బాలింతలు, మరో 4,310 మంది గర్భిణులు ఉండగా, వారందరికీ ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు.
పథకం లక్ష్యమిదీ
నిరుపేద కుటుంబాలకు చెందిన బాలిం తలు, గర్భిణులలో రక్తహీనతను నివారిం చేందుకు, శిశు మరణాలను తగ్గించేం దుకు ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక పూట సంపూర్ణ భోజనాన్ని అందించడం ద్వారా బాలింతలు, గర్భిణుల ఆరోగ్య స్థారుుని పెంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అంగన్‌వాడీ కేంద్రాల్లో వారికి ప్రతిరోజు అన్నం, పప్పు, కూరగాయలు, ఆకు కూరలతో భోజనం పెట్టడంతోపాటు కోడిగుడ్డు, పాలు ఇవ్వాల్సి ఉంది.
నీరుగారుతోందిలా...
గర్భిణులు, బాలింతలకు ఆహారం అందించేందుకు ఒక్కొక్కరికి రోజుకు రూ.11 చొప్పున ప్రభుత్వం కేటారుుస్తోంది. ఇందుకు అవసరమైన బియ్యం, పప్పు, నూనెలను ఐసీడీఎస్ కేంద్రాల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిస్తున్నారు. కూరగాయలు, కోడిగుడ్లు, పాలు, ఆకుకూరలు వంటివాటిని ఇందిరా క్రాంతి పథం వీవోలు సరఫరా చేస్తారు. ఇందుకు సంబంధించిన నిధులు వీవోలకు ఐసీడీఎస్ నుంచి సకాలంలో అందటం లేదు. దీంతో వారు అంగన్‌వాడీ కేంద్రాలకు ఆ సరుకులను సరఫరా చేయడం లేదు. ఐసీడీఎస్ నుంచి బియ్యం, నూనెలు, పప్పులను అందించడంలో జాప్యం చోటుచేసుకుంటోంది.
సమన్వయ లోపం
ఐసీడీఎస్, ఐకేపీ శాఖల మధ్య సమన్వ యం కొరవడటంతో పథకం అమలులో సమస్యలు తలెత్తుతున్నారుు. సరుకులు కొనేది ఒకరు.. పర్యవేక్షణ చేసేది మరొకరు కావడంతో కొన్ని సెంటర్లలో రెండు శాఖల సిబ్బంది మధ్య ఘర్షణలు తలెత్తుతున్నారుు.
సమస్యలు ఇలా...
అంగన్‌వాడీ కేంద్రాలు దూరంగా ఉండటంతో గర్భిణులు, బాలింతలు ఒక పూట భోజనం చేయడానికి కిలోమీటర్లకొద్దీ నడిచి వెళ్లాల్సి వస్తోంది. కటిక నేలపై కూర్చుని భోజనం తినాల్సిన దుస్థితి దాపురిస్తోంది. కొన్నిచోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు లబ్ధిదారుల ఇళ్లకు సమీపంలోనే ఉంటున్నా.. నేలపై కూర్చోవాల్సిన పరిస్థితులు మాత్రం అన్నిచోట్లా ఉన్నారుు. దెందులూరు మండలం రామారావుగూడెంలో అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి భోజనం, కోడిగుడ్డు, పాలు తీసుకోవాలంటే రెండున్నర కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. వైద్యులు అధిక దూరం నడవద్దని సూచిస్తున్నా.. ప్రభుత్వం కల్పించే లబ్ధిని పొందడానికి కష్టమైనా నడిచి వెళ్లక తప్పడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. అంతదూరం నడవలేని పరిస్థితుల్లో 20 మందికి గాను నలుగురైదుగురు మాత్రమే అంగన్‌వాడీ కేంద్రానికి వస్తున్నారు.
పెద్దలు ఆలోచించాలి
అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి రావాలంటే చాలా కష్టంగా ఉంది. రెండున్నర కిలోమీటర్ల నడక కష్టం కాదా. డాక్టర్లు మమ్మల్ని ఎక్కువ దూరం నడవొద్దంటున్నారు. రోడ్డు కూడా గోతులు పడటంతో అవస్థలు పడుతున్నాం. పెద్దలు ఆలోచించాలి. మా సమస్యను పరిష్కరించాలి.
- గుర్రం వెంకటేశ్వరమ్మ, గర్భిణి
దృష్టి సారిస్తాం
అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేస్తున్న పథకాలకు లబ్ధిదారులు అలవాటు పడ్డారు. అమృతహస్తం పథకంపై మరింత క్షేత్రస్థాయి ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా సీడీపీవోలు, సెక్టార్ సూపర్‌వైజర్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. బాలింతలు, గర్భిణులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. దూరంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను లబ్ధిదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పరిశీలన జరుపుతాం.
- వసంతబాల, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డెరైక్టర్
ఆయూసం వస్తోంది
అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లాలంటే ఎంతో బాధగా ఉంటోంది. నడవలేక ఆయూసం వస్తోంది. అంగన్‌వాడీ భవనం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటే వెళ్లి రావటం కష్టమే కదా.
- కంసాల పల్లవి, బాలింత
ప్రత్యామ్నాయం చూస్తే బాగుంటుంది
మా ఊళ్లో బాలింతలు ఎక్కువమంది ఉన్నారు. అధికారులు మా పరిస్థితిని అర్థం చేసుకుని ప్రత్యామ్నాయం చూస్తే బాగుంటుంది. మేం ఉంటున్న ప్రాంతంలోనే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని కోరుతున్నాం.
- రాజబోయిన కోట సత్యవతి, బాలింత