విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించడం తో యలమంచిలి ఎమ్మెల్యే యు.వి. రమణమూర్తి రాజు (కన్నబాబు) అంతర్మథనంలోపడ్డారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు అవుతాయేమోనని ఆందోళన చెం దుతున్నారు. తన ముఖ్య అనుచరులు, పార్టీ మద్దతు దారుల్లోనూ ఇదే వ్యక్తం కావడంతో గురువారం నుంచి కేడర్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ మారే విషయంలో తొందరపాటు వద్ద ని, ఏ నిర్ణయమైనా అంతా కలిసే తీసుకుందామని వారికి సర్దిచెబుతున్నారు.
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంతో సీమాంధ్రలో ప్రజాందోళన ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. ఉద్యమం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చడంతో జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లోనూ కంగారు మొదలైంది. పార్టీ నిర్ణయంతో తమ నియోజక వర్గాల్లో కూడా ఇబ్బందులు తథ్యమనే నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యే కన్నబాబు పార్టీ నిర్ణయంపై తీవ్ర ఆందోళనతో వుండగా, ఆయన మద్దతు దారులు వేరే దారులు వెదుక్కునే ఆలోచనలో పడ్డారు.
కాంగ్రెస్‌లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదని, గెలిచే పార్టీ వైపు వెళదామని వారంతా ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచారు. నియోజక వర్గంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకు బలహీనమవుతుండటంతో నష్ట నివారణకు ఆయన నేరుగా రంగంలోకి దిగారు. సర్పంచ్‌లు, మండల స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని తన నివాసంలో గురువారం యలమంచిలి మండల నాయకులతో సమావేశమయ్యారు.
తెలంగాణ ప్రకటన అనంతరం పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత, స్థానిక పరిస్థితుల గురించి వారితో చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో ఇక కొనసాగవద్దని కొందరు నాయకులు ఆయనను ఒత్తిడి చేసినట్లు తెలిసింది. వారి అభిప్రాయంతో ఎమ్మెల్యే కన్నబాబు కూడా ఏకీభవించారని సమాచారం. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, అంతా కలిసి ఒకే తాటి మీద ఉందామని ఎమ్మెల్యే వారిని బుజ్జగించారు. నియోజక వర్గంలోని అన్ని మండలాల కేడర్‌తో సమావేశాలు జరిపి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని ఒక నిర్ణయానికి వద్దామని చెప్పారు. శుక్రవారం అచ్యుతాపురం, శనివారం రాంబిల్లి మండలాల కేడర్‌తో సమావేశాలు ఏర్పాటు చేశారు.
పార్టీ మారుదామా?
Published Fri, Sep 27 2013 1:28 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement