సంజయకృష్ణ, చెవిరెడ్డి,కల్పన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభం కావడానికి ముందే పార్టీ శాసనసభా పక్ష ఉపనేతలు జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పన నేతృత్వంలో పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణను కలసి 75వ నిబంధన కింద ఈ నోటీసును అందజేశారు. ‘ప్రస్తుత మంత్రిమండలిపై ఈ శాసనసభ అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నది’ అని అందులో పేర్కొన్నారు. అవిశ్వాసం నోటీసుపై వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేతలతో పాటు ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణ రంగారావు, బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, కిడారు సర్వేశ్వరరావు, విశ్వాసరాయి కళావతి, వరుపుల సుబ్బారావు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంతకాలు చేశారు.
రెండేళ్ల పాల నలో బాబు ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని, ఇంకా అధికారంలో కొనసాగితే రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం కలుగుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చకుండా ప్రజలను దారుణంగా మోసం చేశారని పాలకులపై మండిపడ్డారు.
ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
బాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల విశ్వాసం కోల్పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. గద్దెనెక్కి రెండేళ్లవుతున్నా ఒక్కహామీనీ టీడీపీ సర్కారు నెరవేర్చలేదని, అన్నివిధాలా విఫలమైన ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు వెల్లడించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వీరంతా మాట్లాడారు. అవిశ్వాస తీర్మానానికి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న అనేక మంది పాలకపక్షం ఎమ్మెల్యేల మద్దతు విషయమై చర్చ జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. వీలైనంత తొందరగా అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకోవాలని సభాపతిని సుజయ్ కృష్ణ రంగారావు కోరారు.
ప్రజా శ్రేయస్సును విస్మరించారు..
బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. చివరికి ప్రజా శ్రేయస్సును మరచి భూదందా గురిం చి ఆలోచిస్తోందని సుజయ్‌కృష్ణ మండిపడ్డారు. రాజధానిప్రాంతంలో పేద రైతుల నుంచి టీడీపీ నేతలు భూములు లాక్కొన్నారని అన్నారు.
మాఫియా ప్రభుత్వం: చెవిరెడ్డి
చంద్రబాబు ప్రభుత్వం మాఫియా ప్రభుత్వంగా మారిందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక, లిక్కర్, ల్యాండ్ మాఫీయాలే కొనసాగుతున్నాయన్నారు. రాజధాని నిర్మాణంలో అక్రమాలకు పాల్పడడమే చంద్రబాబు సర్కారు విధానమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన ‘దోచుకో.. దాచుకో’ అన్న రీతిగా కొనసాగుతోందంటూ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నిప్పులు చెరిగారు.
అవిశ్వాసాన్ని ఎదుర్కొందాం
మంత్రివర్గ సమావేశంలో సీఎం బాబు
ప్రభుత్వంపై శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాసం నోటీసును ఎదుర్కొందామని సీఎం చంద్రబాబు చెప్పారు. అవిశ్వాసంపై చర్చ సమయంలో మంత్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతిపక్షం ప్రస్తావించే ప్రతి అంశానికీ దీటుగా సమాధానం ఇవ్వాలన్నారు. శాసనసభ కమిటీ హాల్‌లో గురువారం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2016-17 సంవత్సర వార్షిక బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించింది.
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన నోటీసుపై చర్చ జరిగింది. ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని బాబు వివరించారు. అడ్డంకులు సృష్టించి, అప్రతిష్టపాలు చేసేందుకే విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదన్నారు. ఈ విషయాన్ని వివరించి సాయం చేయాలని కోరేందుకు తాను మరోసారి ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పారు.