ఇదేం సెట్ ..!
ఎంసెట్‌పై పంతానికి పోతున్న తెలుగు రాష్ట్రాలు
విద్యార్థుల ఆందోళనను పట్టించుకోని ప్రభుత్వాలు
సమస్య పరిష్కారం పట్ల కనిపించని చిత్తశుద్ధి
ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్న విద్యా మంత్రులు
గవర్నర్ సూచనలపైనా స్పందన కరువు
ఇరు ప్రభుత్వాల తీరును తప్పుబడుతున్న విద్యావేత్తలు
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఎంసెట్ వివాదం ముదురుతోంది. సమస్య పరిష్కారానికి కలసి రావాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యా శాఖ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారే తప్ప పక్కా పరిష్కార మార్గాలపై దృష్టి సారించడం లేదు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే నడచుకుంటున్నామని ఎవరికి వారు చెబుతున్నారేగానీ విద్యార్థుల ఆందోళనను పట్టించుకోవడం లేదు.
ఇరు ప్రభుత్వాల్లోని ఏ స్థాయిలోనూ రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం లేదు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా పరీక్షల షెడ్యూళ్లు ప్రకటిస్తుండగా... తెలంగాణ సర్కారు కూడా సొంతంగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ జేఎన్‌టీయూ నేతృత్వంలో ఎంసెట్ నిర్వహణకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పైగా రెండు రాష్ట్రాల్లోనూ తామే నిర్వహిస్తామని పేర్కొంది.
చొరవ చూపని ఇరు ప్రభుత్వాలు
ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహణపై ఇరు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారు. ఉమ్మడి ఎంసెట్‌కు తెలంగాణ మంత్రి ఒప్పుకొన్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. మరోవైపు ఎవరు నిర్వహించాలన్నదాన్ని విద్యా శాఖ కార్యదర్శుల స్థాయిలో తేల్చితే.. ఆ తర్వాత సంయుక్త ప్రకటన చేద్దామని ఏపీ మంత్రికి ప్రతిపాదించినట్లు తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి చెబుతున్నారు.
ఇక ఇరు రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లు కూడా అలాగే వ్యవహరిస్తున్నాయి. ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి ఏక పక్షంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించారు. తామే కాంపిటెంట్ అథారిటీ అని కూడా ప్రకటించేసుకున్నారు. దీంతో తమ ఎంసెట్‌ను తామే నిర్వహించుకుంటామని, జనవరి 5లోగా తెలంగాణ ఎంసెట్‌కు షెడ్యూలు ఇస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. నిజానికి ఏపీ మండలే కాంపిటెంట్ అథారిటీ అయితే ముందుగా తమతో చర్చించి ఒప్పందం చేసుకోవాలని అంటున్నారు.
ఏకపక్షంగా షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. విభజన చట్టంలోని నిబంధనలపై ఇరు రాష్ట్రాలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల ఇబ్బందుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వాల తీరు ఇలా ఉండదని విద్యావేత్తల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో స్పష్టమైన విధానం కోసం మంత్రులు, అధికారులు ఎందుకు చొరవ ప్రదర్శించడం లేద ని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కాగా, చెరో ఏడాది పరీక్ష నిర్వహించాలన్న గవర్నర్ సూచనపై ఇరు రాష్ట్రాలు ఎంతమేరకు స్పందిస్తాయన్న సందేహాలు నెలకొన్నాయి.
అనవసర రచ్చ చేస్తున్నారు: చుక్కా రామయ్య, విద్యావేత్త
రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకోవాలి. అనవసర రాద్ధాంతం వద్దు. హైదరాబాద్ జేఎన్‌టీయూకు రెండు రాష్ట్రాలు కలిసి బాధ్యత అప్పగిస్తే సరిపోతుంది. లేదంటే ఐదుగురితో కూడిన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాలకు ఎంసెట్ పరీక్షను నిర్వహించాలి. రెండు ప్రభుత్వాలు, గవర్నర్ ఈ దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది. రచ్చ చేయడం మంచిది కాదు.
ఎంసెట్‌పై వివాదాలు వద్దు: పి.మధుసూదన్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు
ఎంసెట్‌పై వివాదాలకు ఆస్కారం ఇవ్వద్దు. ప్రస్తుత పరిస్థితులతో రెండు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం ఇరు ప్రభుత్వాలు ఓ అంగీకరానికి రావాలి. ఒప్పందం చేసుకోవాలి. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. గతంలో ఇంజనీరింగ్ ప్రవేశాల సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదంతో వేల మంది విద్యార్థులు నష్టపోయారు.
ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, రాజ్యాంగంలో 371(డి) అధికరణం మేరకు ఉన్న కోటా, రిజర్వేషన్ల విధానాన్ని విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం పదేళ్లపాటు కొనసాగించాలి. రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చుపుచ్చుకునే ధోరణి లేనందున వేర్వేరుగానే ఎంసెట్ నిర్వహించాలి. 15 శాతం ఓపెన్ కోటాలో అందరికీ సీట్లు కేటాయించాలి. విద్యార్థులకు నష్టం లేకుండా సమన్వయంతో వెళ్లాలి
వేర్వేరుగా ఎంసెట్ వద్దు: ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు
ఎంసెట్‌ను వేర్వేరుగా నిర్వహిస్తే ఇరు రాష్ట్రాల విద్యార్థులకూ నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఏపీ విద్యార్థులకు మరింత నష్టం తప్పదు. ఏపీలో ఉన్నత విద్యావకాశాలు మెరుగుపడే వరకు ఉమ్మడిగానే ఎంసెట్ నిర్వహించాలి. ఎవరు ఎంసెట్‌ను నిర్వహించాలన్న దానిపై ప్రభుత్వాల మధ్య పట్టుదలలు ఉండరాదు. ఉమ్మడి ఎంసెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తే ఏపీ ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా అంగీకరించడమే మంచిది. చెరొక ఏడాది నిర్విహ ంచాలి. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి.
ఉమ్మడి కమిటీని వేయాలి: ఎమ్మెల్సీ విఠాపు బాలసుబ్రహ్మణ్యం
విద్యార్ధుల సంక్షేమం దృష్ట్యా ఉమ్మడి ఎంసెట్ కొన్నేళ్లు కొనసాగాలి. కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ ఈ విషయంలో జోక్యంచేసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తుపట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. చెరొక ఏడాది ఎంసెట్ నిర్వహించాలన్న ప్రతిపాదనా సరికాదు. ఇదేదో పంచాయతీ తీర్పులా ఉంది తప్ప మరోటి కాదు. ఎలాంటి గందరగోళం లేకుండా ఉండాలంటే ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఉమ్మడిగా ఒక కమిటీని ఏర్పాటుచేయడం మంచిది. పదేళ్ల పాటు పరీక్షల నిర్వహణ బాధ్యతను ఈ కమిటీకే అప్పగించాలి. ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యుడైన వ్యక్తిని చైర్మన్‌గా నియమించాలి.
అనవసర రచ్చ చేస్తున్నారు : చుక్కా రామయ్య
రెండు రాష్ట్రాలు కలసి మాట్లాడుకోవాలి. అనవసర రాద్ధాంతం వద్దు. హైదరాబాద్ జేఎన్‌టీయూకు రెండు రాష్ట్రాలు కలసి బాధ్యత అప్పగిస్తే సరిపోతుంది. లేదంటే ఐదుగురితో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాలకు ఎంసెట్ పరీక్షను నిర్వహించాలి. రెండు ప్రభుత్వాలు, గవర్నర్ ఈ దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది. రచ్చచేయడం మంచిది కాదు.