
వాదన పూర్తి కాకుండానే.. వాయిదా!
పట్టిసీమ ప్రాజెక్టు గురించి చర్చలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం పూర్తి కాకుండానే సభ వాయిదా పడింది. పట్టిసీమ ప్రాజెక్టు గురించిన చర్చలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అవకాశం లభించగా.. ఆల్మట్టి విషయంలో చంద్రబాబు చెప్పిన అసత్యాలను ఆయన కడిగి పారేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తయిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే.. సుప్రీంకోర్టుకు వైఎస్ రాజశేఖర రెడ్డి సమర్పించిన వివరాలను, అందులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నివేదిక లోని 5సి భాగం గురించి ప్రస్తావించి సాక్ష్యాధారాలతో ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.
ఆ సమయంలో మధ్యలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఆయన తాము ప్రాజెక్టులను పూర్తిచేస్తామంటూ తనదైన శైలిలో మాట్లాడి కూర్చున్నారు. ఆ తర్వాత స్పీకర్ తనకు గవర్నర్ నరసింహన్ నుంచి లేఖ వచ్చిందంటూ.. తన ప్రసంగానికి అసెంబ్లీ ధన్యవాదాలు తెలిపిన అంశాన్ని గవర్నర్ ప్రస్తావించారని చదివి వినిపించారు. అనంతరం అసెంబ్లీని గురువారానికి వాయిదా వేశారు. వాస్తవానికి అంతకుముందే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులిచింతల గురించి మాట్లాడబోతుండగా.. పట్టిసీమ గురించి మాట్లాడాలని, చర్చను డైవర్ట్ చేయొద్దని సూచించారు. కానీ.. చివరకు ఆ పట్టిసీమ గురించి కూడా మాట్లాడే అవకాశం ప్రతిపక్ష నాయకుడికి లభించకుండానే అసెంబ్లీ గురువారానికి వాయిదా పడిపోయింది.