సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అసైన్డ్ కమిటీల విషయమై సోమవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని టార్గెట్ చేశారు. అసైన్డ్ కమిటీల ఏర్పాటుపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో అసలు అసైన్‌మెంట్ కమిటీలు ఉన్నాయా లేదా అని ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు నిలదీశారు. ఎమ్మెల్యే చైర్మన్‌గా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటుచేసే అసైన్డ్ కమిటీల గురించి సమాచారం కోరారు.
ఎమ్మెల్యేల తీరుపై డిప్యూటీ సీఎం కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసైన్డ్ కమిటీలపై సమాచారం తెప్పించుకుంటామని తెలిపారు. అసైన్‌మెంట్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయో లేదా రిపోర్ట్ తెప్పించుకుంటామని ఆయన అన్నారు. అసైన్డ్ కమిటీలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలపై మంత్రి కేఈ అసహనం వ్యక్తం చేస్తూ.. తన చేతిలో ఉన్న పేపర్లను బల్లకేసి కొట్టారు.
సీఎందే బాధ్యత!
అనంతరం డిప్యూటీ సీఎం కేఈ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. అసైన్డ్ కమిటీల బాధ్యత సీఎందేనని అన్నారు. ‘ నన్ను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్తాను. ఎమ్మెల్యేలు నన్ను కాదు.. సీఎంను అడగాలి’ అని కేఈ అన్నారు.
రేషన్ షాప్‌ల్లో వేలిముద్రలు..!
రేషన్‌షాపుల్లో లబ్ధిదారుల వేలిముద్రల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సభ దృష్టికి తెచ్చారు. బయోమెట్రిక్ మెషిన్లలో వేలిముద్రలు రాకపోవడంతో వృద్ధులు, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో మంత్రులు అసత్యాలు చెపుతున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు అంటూ అందరికీ ఆపాదించడం సరికాదని, విష్ణుకుమార్ రాజు తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని యనమల కోరారు. తన ఉద్దేశం అది కాదన్న విష్ణుకుమార్ రాజు.. స్పీకర్ సూచన మేరకు మంత్రులు అబద్ధాలు చెప్తున్నారన్న వ్యాఖ్యలను వెనుకకు తీసుకున్నారు.
బయో మెట్రిక్ మెషిన్లలో వేలిముద్రలు గుర్తించకపోవడంతో రేషన్ ఆగిపోయే పరిస్థితి లబ్ధిదారులకు రానివ్వబోమని పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వెలిముద్రల సమస్యలు ఉన్న చోట వెంటనే స్పందిస్తున్నామని చెప్పారు. మూడు3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకపోయిన కార్డ్ రద్దు కాదని చెప్పారు.
అవస్తవాలు చెప్పాల్సిన అవసరం మంత్రులకు లేదని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాబోమని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment