ఈడీబీతో రెండంకెల వృద్ధి | AP cabinet approves constitution of Economic Development Board | Sakshi
Sakshi News home page

ఈడీబీతో రెండంకెల వృద్ధి

Published Tue, Jun 2 2015 4:29 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

ఈడీబీతో రెండంకెల వృద్ధి - Sakshi

ఈడీబీతో రెండంకెల వృద్ధి

ఆర్థికాభివృద్ధి మండలి ఏర్పాటుకు ఆమోదం
జన్మభూమిలో కొత్తగా 1.50 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ
ఇంటింటికీ ఇంటర్నెట్
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఎయిర్‌పోర్ట్‌లు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండంకెల అభివృద్ధి సాధించడం కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థికాభివృద్ధి మండలి (ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు-ఈడీబీ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల మంత్రి పల్లె రఘునాథరెడ్డి విలేకరులకు వెల్లడించారు. చైనా, సింగపూర్, జపాన్, చిలీ దేశాలు పెట్టుబడులను రాబట్టడం, పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా ఈడీబీలను ఏర్పా టు చేసుకున్నాయని, మన దేశంలో మొదటగా మన రాష్ట్రంలో ఈడీబీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని చెప్పారు. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, విద్యుత్, ఐటీ రంగాల్లో ఐదేళ్లలో రూ.రెండులక్షల కోట్ల పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా ఈడీబీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విజయవాడ ప్రధాన కేంద్రంగా ఈడీబీ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
 
3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే ‘జన్మభూమి-మన ఊరు’లో 1.50 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు పంపిణీ చేస్తారు.
అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 8న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసిన ప్రదేశంలో భారీ ఎత్తున సభ నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ నెల 9 నుంచి 15లోగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలి.
ఈ ఏడాది లక్షల హెక్టార్లలో బిందుసేద్యం (డ్రిప్ ఇరిగేషన్) అమలుచేయాలి. ఎస్సీ, ఎస్టీలకు వందశాతం, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై డ్రిప్‌లను పంపిణీ చేయాలి. దేశంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాలో పంటలను కాపాడటం కోసం పదివేల హెక్టార్లలో కమ్యూనిటీ మొబైల్ డ్రిప్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. విశాఖపట్నం సమీపంలో భోగాపురం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. పౌర విమానయాన విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో 2022 నాటికి ఇంటింటికీ నెలకు రూ.150కే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఫైబర్ ఆప్టిక్ విధానానికి ఆమోదం తెలిపింది.
 
నామినేటెడ్ కోటాకు ఓకే
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి గవర్నర్ కోటాలో నామినేట్ చేసే ఎమ్మెల్సీల పేర్లను మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. గవర్నర్ కోటాలో నామినేట్ కానున్న వారిలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి తొండెపు దశరథ జనార్దనరావు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్రయాదవ్, గౌనివాని శ్రీనివాసులు ఉన్నారు.
 
కేపిటల్ ఇన్‌ఫ్యూజన్‌లోనూ కోత
డ్వాక్రా రుణాల మాఫీపై మాట మార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మహిళలకు పెట్టుబడి అప్పు (కేపిటల్ ఇన్‌ఫ్యూజన్)గా అందించేందుకు కేటాయించిన మొత్తంలోనూ కోత వేశారు. తొలి దశలో డ్వాక్రా మహిళలకు పెట్టుబడి అప్పుగా చెల్లించేందుకు రూ.మూడు వేల కోట్లను కేటాయించాలని మే 4న కేబినెట్ నిర్ణయించింది. కానీ, అదే కేబినెట్ సోమవారం పెట్టుబడి అప్పుగా చెల్లించే మొత్తాన్ని రూ.2,208 కోట్లకే కుదించింది. అంటే రూ.792 కోట్లను కోత వేసినట్లు స్పష్టమవుతోంది.

రాష్ట్రంలో 8,31,399 స్వయం సహాయక సంఘాల పరిధిలో 85.97 లక్షల మంది సభ్యులు ఉన్నారని తేల్చిన కేబినెట్.. అందులో 73.62 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి అప్పు చెల్లించాలని నిర్ణయించింది. 12.35 లక్షల మందికి పెట్టుబడి అప్పు చెల్లించకూడదని కేబినెట్ నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది.
 
గవర్నర్ అధికారాలపై కేంద్రానికి లేఖ
గవర్నర్ నరసింహన్ అధికారాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం.. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపై సుదీర్ఘంగా చర్చిం చింది. పునర్విభజన చట్టం-2014లో సెక్షన్-8 కింద గవర్నర్‌కు కల్పించిన అధికారాలపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ ట్యాక్స్ (ప్రవేశ పన్ను) విధించినప్పుడు గవర్నర్ వ్యవహరించిన తీరును సీఎం ఉదహరించారని, విభజన చట్టంలో కల్పించిన అధికారాల మేరకు గవర్నర్ వ్యవహరిస్తే ఇబ్బంది ఉండదని అభిప్రాయపడ్డారని వివరించారు. విభజన సమయంలో జనాభా ప్రకారం అప్పులను పంచిన కేంద్రం.. ఆస్తులను మాత్రం భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకో కుండా పంపిణీ చేసిందని బాబు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.

ఎక్కడి ఆస్తులు అక్కడి రాష్ట్రానివే అన్న నిబంధన వల్ల ఏపీఎస్‌ఆర్టీసీ, పరిశ్రమలశాఖ పరిధిలోని శిక్షణ కేంద్రాలు, పరిశోధన కేంద్రాల విభజన సంక్లిష్టంగా మారిందని చెప్పారు. విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లోని ఆరు కార్పొరేషన్లు, పదో షెడ్యూల్‌లోని 107 సంస్థలు, ఏ షెడ్యూల్‌లోనూ లేని 45 సంస్థల విభజనపై అస్పష్టత ఉందని కేబినెట్ అభిప్రాయపడిందన్నారు. వీటిపై స్పష్టత ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement