
రూ.వందకే ఇంటర్నెట్, టీవీ కనెక్షన్
‘మీ ఇంటికి ఫైబర్ తీసుకొస్తా. కేవలం వందరూపాయలకే ఇంటర్నెట్, టీవీ కనెక్షన్ వస్తుంది.
♦ రోజుకు రెండు సినిమాలు చూడొచ్చు
♦ సంగం జన్మభూమి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘మీ ఇంటికి ఫైబర్ తీసుకొస్తా. కేవలం వందరూపాయలకే ఇంటర్నెట్, టీవీ కనెక్షన్ వస్తుంది. అప్పుడు మీరు రోజుకు రెండు సినిమాలు చూడొచ్చు. ఏ సినిమా కావాలన్నా చూడొచ్చు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అందుకు రూ.5 వేల కోట్లతో అండర్‌గ్రౌండ్ పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ప్రకాశం జిల్లా నుంచి సాయంత్రం 3.30కు సంగం చేరుకున్న సీఎం నేరుగా తహశీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట్లో గ్రామసర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో, ఆ తర్వాత డ్వాక్రా లీడర్‌తో మాట్లాడించారు. వ్యవసాయ రుణమాఫీ గురించి సుబ్బానాయుడు అనే రైతు తాను రూ.2లక్షలు రుణం తీసుకుంటే.. రూ.30 వేలే మాఫీ అయ్యిందనటంతో.. సీఎం ‘కూర్చో కూర్చో’మని ఆదేశించారు. సుబ్బానాయుడు లేదు సార్.. మీరు చేసింది నాకు మేలు జరిగిందనటంతో మాట్లాడనిచ్చారు.
రూ.50కే కిలో కందిపప్పు
ఈ నెల నుంచే రూ.50కే కిలో కందిపప్పు సరఫరా చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అసంఘటిత కార్మికులకు రూ.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు బీమా వర్తింప చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.
ఎంఆర్‌పీఎస్ నిరసన..మీడియాపై దౌర్జన్యం
సంగం: ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం పర్యటనలో మీడియాపై పోలీసులు దౌర్జన్యం చేశారు. ఎంఆర్‌పీఎస్ నాయకులు సంగం చెక్‌పోస్ట్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి వాహనశ్రేణిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని పక్కకు లాగి లాఠీలతో చితకబాదారు. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ విలేకరి టీవీఆర్ ప్రసాద్, జెమినీ విలేకరి ఎస్‌కె రఫీ, ఈటీవీ విలేకరి కరీముల్లా, టీవీ-9 చాంద్‌బాషాపై పోలీసులు విరుచుకుపడ్డారు. సాక్షి టీవీ రిపోర్టర్ ప్రసాద్‌పై దాడి చేసి అతని చేతిలో ఉన్న కెమెరాను పనికి రాకుండా చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు సంగం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణలకు సైతం ఫిర్యాదు చేశారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సంగం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పెనుప్రమాదం త్రుటిలో తప్పింది. చంద్రబాబు వేదికపైకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా పెనుగాలులకు వేదిక కుడివైపున ఉన్న షామియానా పడిపోయింది. దీంతో కొందరు కానిస్టేబుళ్లు షామియానాను పట్టుకోవడంతో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. సభ ముగిసిన ఐదు నిమిషాల్లో మరోసారి పెనుగాలులు రావడంతో మొత్తం షామియానాలు ఒక్కసారిగా పడిపోయాయి.
బ్లాక్‌మెయిల్ చేస్తే ఖబడ్దార్
తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీఎం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘రాష్ట్రం విడిపోయినప్పటికీ రెండు ప్రాంతాల తెలుగువారందరూ ఐక్యంగా ఉండాలని, అందరినీ కలుపుకునిపోవాలని ప్రయత్నిస్తున్నా. కానీ, అక్కడి వారు నన్ను బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తున్నారు. నేను ఎవరికీ భయపడను.. ఖబడ్దార్... అంటూ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం శీలంవారిపల్లెలో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో ఆయన మాట్లాడారు.