మంత్రి మండలి సమావేశంలో చంద్రబాబు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డీజీపీ నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేలా పోలీస్ చట్టాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలని తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపిన డీజీపీ ప్యానల్ ప్రతిపాదనలు నిబంధన లకు విరుద్ధంగా ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖ మూడు పర్యాయాలు తిప్పి పంపిన నేపథ్యంలో ఏకంగా పోలీస్ చట్టాన్నే సవరించాలని మంత్రివర్గం నిర్ణయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీస్ యాక్ట్ 9 ఆఫ్ 2014ను సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చి, తరువాత అసెంబ్లీలో చర్చించి పూర్తిస్థాయి సవరణకు ఆమోదం పొందాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ఆర్డినెన్సుతో డీజీపీ నియామకాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆలిండియా సర్వీసెస్(ఏఐఎస్) యాక్ట్ 1953కి లోబడి డీజీపీ పదవీకాలం కూడా నిర్ణయించే అధికారం ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రానికి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో శనివారం రాత్రి వరకు జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రి నారాయణతో కలిసి సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. మంత్రివర్గం నిర్ణయాలివీ...
- ఈ ఏడాది డిసెంబర్ 27న నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవం.
- పోలవరం ప్రాజెక్టు పనుల కోసం నిర్మాణ సంస్థకు ప్రభుత్వం ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్ మొత్తాన్ని స్వాధీనపరుచుకోవడాని కి(రికవరీ) మరో ఏడాది గడువు. 2018 సెప్టెంబర్‌కి నిర్మాణ సంస్థ మొబిలైజేషన్ అడ్వాన్స్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
- ‘చంద్రన్న పెళ్లికానుక’పథకాన్ని ఫిబ్రవరిలో ప్రారంభిస్తారు. బీసీలకు రూ.30 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేలు పెళ్లికానుక ఇవ్వనున్నారు.
- ప్రతిపాదిత ట్రాన్స్‌జెండర్ పాలసీపై మంత్రిమండలి చర్చించింది. ఇది అమల్లోకి వస్తే 26 వేల మంది హిజ్రాలకు మేలు జరుగుతుంది. 18 ఏళ్లు పైబడిన హిజ్రాలకు నెలకు రూ.1500 పెన్షన్ అందిస్తారు. వీరికి రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తారు.
- రాష్ట్రంలో కొత్తగా 9 అర్బన్ మండలాల ఏర్పాటు. విశాఖ అర్బన్ 2, 3, 4, విజయవాడ అర్బన్ 2, 3, 4, గుంటూరు, నెల్లూరు, కర్నూలులో ఒక్కొక్కటి చొప్పున అర్బన్ మండలాలు ఏర్పాటు కానున్నాయి.
- కృష్ణా జిల్లా గన్నవరంలో నూతనంగా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కమ్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు. ఈ కోర్టుకు అవసరమైన 27 పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం.
- పప్పుధాన్యాల కొనుగోళ్లకు ముగ్గురు మంత్రులతో కమిటీ.
Comments
Please login to add a commentAdd a comment