సీమకు తాగు, సాగునీరే జీవన్మరణ సమస్య
హంద్రీ-నీవా, గాలేరు-నగరి ద్వారా సస్యశ్యామలం చేస్తాం
* ఇంత చేస్తున్నా ప్రజలు నా గురించి చర్చించుకోవడం లేదు
* ‘అనంత’ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘రాయలసీమకు తాగు, సాగునీరే జీవన్మరణ సమస్య. హంద్రీ-నీవా ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాలకు 25 టీఎంసీలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు మరో 30 టీఎంసీల నీటిని ఇస్తాం. దీంతో పాటు గాలేరు-నగరిని, ఎన్నికలలోపే పోలవరం ప్రాజెక్టునూ పూర్తి చేస్తాం. ఆలోపు సీమ సాగునీటి అవసరాలు తీర్చేందుకే పట్టిసీమను చేపట్టాం.
హంద్రీ-నీవా ద్వారా పీఏబీఆర్, మిడ్‌పెన్నార్ డ్యాం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీళ్లిస్తాం. వీటన్నిటి ద్వారా రాయలసీమలోని నాలుగు జిల్లాలకు సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హంద్రీ-నీవా పనుల పరిశీలనకు ఆయన శుక్రవారం అనంతపురానికి విచ్చేశారు. జీడిపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించారు. రిజర్వాయర్‌తో పాటు హంద్రీ-నీవా కాలువ పనులను హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పురోగతిపై నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
నన్ను గుర్తుంచుకోవడం లేదు:
‘అమెరికాలో హెల్త్‌ఇన్సూరెన్స్ ప్రకటిస్తే బాగుందా? లేదా? అని ఏడాది పాటు ప్రజలు చర్చించుకుంటారు. నేను రూ.22కోట్ల నుంచి రూ.25కోట్ల వరకు రుణమాఫీ చేశా! దేశంలో ఎవ్వరూ చేయలేదు. ఈ అంశంలో సవాల్ విసురుతున్నా! పింఛను మొత్తాన్ని పెంచా! డ్వాక్రా మహిళలకు పదివేలు పెట్టుబడి రుణం ఇస్తున్నా! మొదటి విడతగా రూ.3 వేలు ఇచ్చా! అయినా పథకాల గురించి, నా గురించి ఎవ్వరూ చర్చించడం లేదు. మీరు ఆలోచించండి తమ్మూళ్లూ!’ అని తనను గుర్తించాలని పరోక్షంగా చంద్రబాబు వేడుకున్నారు.
చంద్రబాబుతో జపాన్ బృందం భేటీ
సాక్షి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలోని బస్సులో జపాన్ బృందంతో భేటీ అయ్యారు. జైకా, జేబీఐసీ కంపెనీలకు చెందిన ఐదుగురు ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాల గురించి సీఎంతో చర్చించారు. 4 వేల మెగావాట్ల సూపర్ పవర్ థర్మల్ క్రిటికల్ యూనిట్ ఏర్పాటు గురించి ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ‘ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది, పెట్టుబడి ఎంత’ తదితర అంశాలను వారు సీఎంకు వివరించారు.
అయితే ఫుడ్ ప్రాసెసింగ్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎం రెండు కంపెనీల ప్రతినిధులను కోరారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో పెట్టుబడుల గురించి జైకా సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం పోలవరం కుడికాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న పామాయిల్ రైతులు సీఎంను కలసి తమ సమస్యలను వివరించారు.