మేమేమైనా పిల్లలమా? | AP CM extreme dissatisfaction on the way | Sakshi
Sakshi News home page

మేమేమైనా పిల్లలమా?

Published Sat, May 9 2015 8:31 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

మేమేమైనా   పిల్లలమా? - Sakshi

మేమేమైనా పిల్లలమా?

వార్షిక పరీక్షలు, పనితీరు మదింపుపై మండిపడుతున్న మంత్రులు
 ఏపీ సీఎం తీరుపై తీవ్ర అసంతృప్తి


హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై మంత్రుల్లో తీవ్రఅసహనం, అసంతృప్తి వ్యక్తమవుతోంది. వార్షిక పరీక్షలు, పనితీరు మదింపు చేస్తామనడంపై ‘మేమేమైనా చిన్న పిల్లలమా?’ అంటూ సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా మంత్రులందరూ వాపోతున్నారు. మంత్రులు ఏడాది పనితీరుపై స్వీయ నివేదికలను రూపొందించి ముఖ్యమంత్రి ఓఎస్డీ అభీష్టకు పంపించాలనడంపైనా వారు మండిపడుతున్నారు. అభీష్టకు స్వీయ నివేదికలను పంపిస్తే, ఆయనతోపాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి పరిశీలించి నివేదిక రూపొందిస్తారా? వాటి ఆధారంగా లోకేష్ మార్కులు వేస్తారా? ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా జరిగిందా? అని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మంత్రులు భాగస్వాములు. మంత్రిమండలిలో ముఖ్యమంత్రితోపాటు సమిష్టి నిర్ణయాలు తీసుకునే  అవకాశాన్ని మంత్రులకు రాజ్యాంగం దాఖలు పరి చింది. మంత్రిమండలి సమావేశంలో సీఎం, మంత్రులు అనే తారతమ్యాలు ఉండవు. అలాంటి వారిని స్వీయ నివేదికలు అడగడంతోపాటు ఎలాంటి సంబంధం లేని లోకేశ్, ఓఎస్డీ, విశ్రాంత ఐఏఎస్ అధికారి పనితీరు మదింపు చేస్తామనడం జీర్ణించుకోలేకపోతున్నారు.
 
కేబినెట్ సాగే తీరిదేనా?

విధానపరమైన నిర్ణయాలతోపాటు ప్రజలకు ప్రయోజనం కార్యక్రమాలు చేపట్టడానికి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు. అయితే, సోమవారం కేబినెట్ సాగిన తీరు అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని మంత్రులే వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి సచివాలయంలో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలపైనా మంత్రులు, ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్దీ సమావేశాలు నిర్వహించడం, మళ్లీ వారం తిరగకుండా అదే అంశంపై సమీక్ష నిర్వహించడం వల్ల సమయమంతా వృధా అవుతోంది. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసి ఫలితాలు సాధించడానికి సమయమే దొరకడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సమావేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు ఏ మాత్రం దోహదపడటం లేదని ఉన్నతస్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement