సాక్షి, విజయవాడ: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశమంతా హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటోందని.. ఇలాంటి సమయంలో బాధ్యత గల పౌరులుగా వ్యవహరించడం మన కర్తవ్యం అని పేర్కొన్నారు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబం, దేశం కోసం అందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని చెప్పారు. అన్ని రాష్ట్రాల మధ్య సరిహద్దులు మూసివేయబడ్డాయని.. ఆదేశాలు ఉల్లంఘించి సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు.
(చేతులెత్తి నమస్కరిస్తున్నా.. అర్థం చేసుకోండి)
‘‘జిల్లా సరిహద్దులను ఛేదించుకుని బైక్‌లు, కార్లు, బస్సుల్లో వచ్చి చట్టాలను ఉల్లంఘించారు. అయినా మనవతా దృక్ఫథంతో రెండు ప్రభుత్వాలు చర్చించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రోటోకాల్ ప్రకారం వారి ఆరోగ్యాన్ని, కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికల్ పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలోకి అనుమతించేలా ఏర్పాటు చేశాం. అందులో భాగంగా వారి కోసం బస్సులు సమకూర్చాం. కానీ ఇవేం పట్టించుకోకుండా వారు బోర్డర్ దాటడానికి ప్రయత్నించారు. పోలీసులపై మూకుమ్మడి దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని’ డీజీపీ పేర్కొన్నారు. మూకుమ్మడి దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలని హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలకు డీజీపీ విజ‍్క్షప్తి చేశారు. రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయని..ఆ మేరకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా నిర్ణయం తీసుకున్నామని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment