
డీజీపీ సాంబశివరావుకు తప్పిన ప్రమాదం
ఏలూరు : ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. తణుకు పదహారో నెంబరు జాతీయ రహదారిపై డీజీపీ సాంబశివరావు కాన్వాయి ప్రమాదానికి గురైంది.
ఎదురుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వచ్చిన కాన్వాయ్ ఢీకొట్టింది. డీజీపీ వాహనం సహా కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. డీజీపీ సాంబశివరావు వేరే వాహనంలో విజయవాడ వెళ్లిపోయారు. కాకినాడ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ఘటన జరిగింది.