సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ–2018 నిర్వహణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కు అప్పగించారు. పరీక్ష నిర్వహణ, పోస్టుల సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో ఈ నెల 15న విడుదల కావాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. డీఎస్సీపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వహణపై చర్చించారు. డీఎస్సీని పకడ్బందీగా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీపీఎస్పీ ఛైర్మన్ చెప్పారు. అయితే, ఈ నెల 15న ఇవ్వాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడినందున దరఖాస్తుల స్వీకరణ, అనంతరం పరీక్ష నిర్వహణకు సమయం తక్కువగా ఉంటుందని అధికారులు మంత్రికి వివరించారు. జాతీయస్థాయిలో జరిగే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణీత గడువును ఇస్తూ డీఎస్సీ పరీక్ష తేదీలను నిర్ణయిస్తామన్నారు.
కొత్త ఏడాదిలో కొత్త నోటిఫికేషన్లు
పరీక్షను ఆన్‌లైన్‌లో (కంప్యూటర్ ఆధారితంగా) నిర్వహించాలా? లేక ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలా? అనేదానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. దరఖాస్తుల సంఖ్య 25 వేలకు మించితే పరీక్షను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాల్సి ఉంటుందని, రోజుకు 50 వేల మంది వరకు పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వాలని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ పేర్కొన్నారు. ఇక పోస్టులపై సాధ్యమైనంత త్వరగా జిల్లాల నుంచి సమాచారాన్ని తెప్పించి, ఏపీపీఎస్సీకి అందించాలని మంత్రి గంటా ఆదేశించారు. ఆర్థిక శాఖ అనుమతి రావాల్సిన పోస్టులపైనా త్వరితంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఎంపికైన అభ్యర్థులకు 2018 జూన్ 12 నాటికి ఉత్తర్వులు అందించేలా చూడాలని పేర్కొన్నారు.
ఖాళీలు, రోస్టర్, సిలబస్, అర్హతలు, ఇతర అంశాలపైనా చర్చించారు. అవసరమైతే విద్యాశాఖ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌కు మంత్రి గంటా సూచించారు. సమావేశం అనంతరం ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్ మీడియాతో మాట్లాడారు. తొలిసారిగా ఏపీపీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే కొత్త ఏడాదిలో పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. కోర్టు కేసుల వల్ల పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోందన్నారు. ఏపీపీఎస్సీ కార్యకలాపాలను త్వరలో విజయవాడ నుంచే కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పండాదాస్ పాల్గొన్నారు.
విద్యాశాఖ ద్వారానే డీఎస్సీ: యూటీఎఫ్
టీచర్ పోస్టుల భర్తీని విద్యాశాఖ ద్వారానే చేపట్టాలని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ సాబ్జీ, పి.బాబురెడ్డి, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించామన్నారు. 5,735 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1,531 పీఈటీ పోస్టులు, 248 పండిట్ పోస్టులు అవసరమని గతేడాది రేషనలైజేషన్‌లో లెక్కల్లో తేల్చారని, వాటిని కూడా ఇప్పుడు డీఎస్సీలో కలిపి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment