వాలుతున్న రాబందులు | AP enhances compensation limit for Hudhud cyclone relief | Sakshi
Sakshi News home page

వాలుతున్న రాబందులు

Published Tue, Nov 25 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

వాలుతున్న రాబందులు

వాలుతున్న రాబందులు

 హుద్‌హుద్ తుపాను పరిహారాన్ని తన్నుకుపోయేందుకు పాలక రాబందులు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నాయి. సెంటు భూమి లేకున్నా పర్లేదు.. అధికార పక్ష సానుభూతిపరులైతే చాలు.. ఎలాగోలా పరిహారం ఇచ్చేయాలంటున్నాయి. జాబితాలపై సంతకాలు చేయాలంటూ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నాయి. దీనిపై తొండంగి, శృంగవృక్షం గ్రామాల్లో ‘సాక్షి’ పరిశీలన జరపగా.. అధికార పార్టీ నేతలే బినామీ పేర్లతో సొంత జాబితాలు తయారు చేసి, తద్వారా పెద్ద ఎత్తున పరిహారం సొమ్ములు కాజేసేందుకు పక్కా ప్లాన్ చేశారన్న విషయం వెల్లడైంది. ఈ జాబితాలను అధికారులకు అందజేసి ఆమోదం కోసం ఒత్తిడి తెస్తున్నారు. దీనికి అధికారులు ససేమిరా అంటున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :గత నెలలో సంభవించిన హుద్‌హుద్ తుపానుతో జిల్లాలోని తుని, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని పలు మండలాలల్లో నష్టం సంభవించింది. అరటి, వరి, చెరకు సహా పలు పంటలను రైతులు నష్టపోయారు. వారికి పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉద్యావన శాఖాధికారి, వీఆర్వోలతో కూడిన బృందాలు పండ్ల తోటల నష్టంపై జాబితాలు రూపొందిస్తున్నారు. ఇక్కడే అధికార పార్టీ నాయకులు రంగప్రవేశం చేశారు. కొందరు  అధికారులపై ఒత్తిడి తెచ్చి నాయకులు జాబితాలను తమవారి పేర్లతో నింపే పనిలో బిజీగా ఉన్నారు. తొండంగి మండలం శృంగవృక్షం, తొండంగి, ఎ.కొత్తపల్లి, సీతారాంపురం, కొమ్మనాపల్లి, గోపాలపట్నం, బెండపూడి, చిన్నాయిపాలెం, పైడికొండ, ఆనూరు, పి.అగ్రహారం గ్రామాల్లో అధికార బృందాల సర్వే పూర్తైది. వీటిలో గోపాలపట్నం, సీతారాపురం తదితర గ్రామాల్లో అనర్హులను జాబితాలో చేర్చారన్న ఫిర్యాదులున్నాయి.
 
 వీటితోపాటు  తొండంగి, శృంగవృక్షం గ్రామాల్లో జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొండంగి తహశీల్దార్ కార్యాలయం, కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం జరిగిన గ్రీవెన్స్‌సెల్‌కు ఈ రెండు గ్రామాల జాబితాలపై ఫిర్యాదులు వచ్చాయి. శృంగవృక్షంలో అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నాయకుడి వెంట తిరిగే అనుచరులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున పరిహారం వచ్చేలా జాబితా తయారు చేయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ ఒక్క గ్రామంలోనే సుమారు 235 పేర్లతో జాబితా రూపొందింది. వాటిలో 80 పైగా పేర్లు అధికార పార్టీ నేతల బంధువర్గం, అనుయాయులవేనన్న ఆరోపణలు వస్తున్నాయి.
 
  తొండంగిలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. అరటి, కొబ్బరి, టేకు చెట్లు కుప్ప కూలిపోయినట్టు జాబితాలు రూపొందించి, వాటిని ఆమోదించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది.  ఈ గ్రామానికి చెందిన రాంబాబుకు 539 సర్వే నంబరులో సుమారు మూడెకరాల భూమి ఉన్నట్టు నేతలు రూపొందించిన జాబితాలో ఉంది. ఆ పొలాన్ని కౌలుకు ఇవ్వగా, ఖరీఫ్‌లో వరి సాగు చేశారు. పంట చేతికొచ్చి కోతకు సిద్ధంగా ఉంది. నష్టాలపై నేతలు రూపొందించిన జాబితాలో మాత్రం అరటితోట వేసినట్టు చూపించారు. 20 సెంట్లకుగానూ నష్టపరిహారంగా రూ.5 వేలు రాయించుకున్నారు.
  ఇదే గ్రామానికి చెందిన పి.ఈశ్వరుడికి సెంటు భూమి కూడా లేదు. కానీ అతడి పేరున 544, 544/1 సర్వే నంబర్లు సృష్టించి 60 సెంట్లు భూమిలో అరటి తోట పడిపోయినట్టు జాబితాలో చూపించారు. అందుకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని దరఖాస్తు చేశారు.

  ఇదే సర్వే నంబర్లలో గోవిందు అనే రైతుకు 30 సెంట్లలో అరటితోట నష్టపోయినట్టు చూపించారు. ఇందుకు రూ.7500 పరిహారం ఇవ్వాలని జాబితాలో పొందుపరిచారు.  తొండంగి తహశీల్దార్ కార్యాలయంలోని ఓ ఉద్యోగి సమీప బంధువుల పేరుతో రెండు బినామీ సర్వే నంబర్లు చూపించాడని తెలియవచ్చింది. వాటిలో అరటి పంటకు నష్టం వాటిల్లినట్టు జాబితాలో నమోదు చేయించుకున్నారని చెబుతున్నారు. ఆ జాబితాతో రూ.లక్షన్నర పరిహారం కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
 
 అర్హత ఉన్నా జాబితాలో దక్కని చోటు
  ఈ అవకతవకల జాబితాలపై తొండంగికి చెందిన అరటి రైతు అయ్యన్న కలెక్టరు నీతూ ప్రసాద్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 568/2లోని 2.72 సెంట్లు భూమిలో ఎకరం అరటి తోట పడిపోయిందని, అయినప్పటికీ జాబితాలో చోటులేకుండా చేశారని వాపోయారు  గోపాలపట్నంలో కె.సత్యనారాయణ అనే రైతుకు 77 సర్వే నంబర్‌లో అర ఎకరం పొలం ఉంది. ఇందులో వేసిన అరటి తోట పడిపోయింది. కానీ జాబితాలో తన పేరు లేదని ఆయన లబోదిబోమంటున్నారు. దాదాపు ఇటువంటివే ఉదాహరణలు తుని మండలంలో కూడా ఉన్నాయి. ఈ మండలంలోని పి.వెంకటాపురం, తేటగుంట, కొలిమేరు గ్రామాల్లో కూడా అక్కడి అధికార పార్టీ నేతలు తమ అనుయాయులు, బంధువుల పేర్లను జాబితాల్లో చేర్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 అరటి తోటల వరకూ ఫొటోలు తీయించి అధికారులకు ఇవ్వగా, మిగిలిన పూలతోటలు, కూరగాయల తోటలకు సంబంధించి తప్పుడు రికార్డులు సృష్టించారని చెబుతున్నారు. అవకతవకలు బయటకు పొక్కడంతో ఈ జాబితాల్లో మరోసారి మార్పులు చేసేందుకు నేతలు సిద్ధపడుతున్నారు. నియోజకవర్గంలో సర్వే చేసిన అన్ని గ్రామాల్లోనూ పంటనష్టం జాబితాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని మాజీ సర్పంచ్ కటకం ఈశ్వరరావు తదితరులు జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 27న హుద్‌హుద్ తుపాను ప్రభావాన్ని పరిశీలించేందుకు జిల్లాకు రానున్న కేంద్రబృందం దృష్టికి ఈ అక్రమాల విషయాన్ని తీసుకువెళ్లేందుకు స్థానికులు సిద్ధపడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement