సీఎం వైఎస్‌ జగన్‌: ఏపీపీఎస్సీ ఉద్యోగాలపై ముఖ్యమంత్రి చరిత్రాత్మక నిర్ణయం | AP Govt Cancels Group-1 and Group-2 Interviews - Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1, గ్రూప్‌–2 సహా అన్ని ఉద్యోగాల్లో.. ఇంటర్వ్యూలు రద్దు

Published Fri, Oct 18 2019 4:00 AM | Last Updated on Fri, Oct 18 2019 6:10 PM

Ap Government Cancelled Group1 And Group 2 Interviews - Sakshi

సాక్షి, అమరావతి: పారదర్శక విధానాలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహించే పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దుచేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ గురువారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూ విధానాలపై చర్చించారు. ఫలితాల వెల్లడికి సంబంధించి అవినీతి, అక్రమాలపై ప్రతి సందర్భంలో ఆరోపణలు వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఏపీపీఎస్సీ జారీ చేస్తున్న నోటిఫికేషన్లు కూడా న్యాయ వివాదాలకు దారి తీస్తున్నాయని చెప్పారు. వీటిపై కూలంకషంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి పారదర్శక విధానాలపై చర్చించారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీలో అత్యుత్తమ పారదర్శక విధానాలకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్‌–1, గ్రూప్‌–2సహా అన్ని విభాగాల ఉద్యోగాలకూ ఇంటర్వ్యూ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు.

పరీక్షల నిర్వహణలో ఐఐఎం, ఐఐటీల సహకారంపై దృష్టి..
ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించి ఏటా జనవరి 1వ తేదీన క్యాలెండ్‌ విడుదల చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల్లో పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో విశ్వసనీయత పెంచేందుకు ప్రఖ్యాత ఐఐఎం, ఐఐటీల సహకారం, భాగస్వామ్యాలను తీసుకోవడంపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.

నవంబర్‌ చివరిలో ఖాళీల జాబితా సిద్ధం!
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నవంబర్‌ మూడోవారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల జాబితాను తయారు చేస్తారు. భర్తీ చేయాల్సిన పోస్టులు, బడ్జెట్‌ కేటాయింపులు తదితర ప్రతిపాదనలతో నవంబర్‌ నెలాఖరులోగా ముఖ్యమంత్రితో అధికారులు మరోసారి సమావేశం అవుతారు. అన్ని సన్నాహాలు పూర్తైన తర్వాత 2020 జనవరి 1వతేదీన ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ క్యాలెండర్‌ విడుదల చేయనుంది. దీనికి అనుగుణంగా ఏటా ఉద్యోగాల భర్తీ చేపడతారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement