జిల్లా వ్యాప్తంగా రీ సర్వే | AP Government Conducting Re Survey In East Godavari | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా రీ సర్వే

Published Thu, Jul 11 2019 12:05 PM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM

AP Government Conducting Re Survey In East Godavari - Sakshi

ఇళ్లు, వాకిళ్లు, పంట పొలాలు.. వీటిలో కొన్నింటిలో సరిహద్దు వివాదాలు.. సర్వే నంబర్లతో కుస్తీపట్లు.. అడంగళ్లలో  తప్పులు.. పొరపాట్లతో న్యాయస్థానాల్లో సహితం తేలని పంచాయితీలు. మరోవైపు వరి, కొబ్బరి, ఆక్వా, రియల్‌ ఎస్టేట్‌గా మారుతున్న భూములు... రోజుల్లోనే మారిపోతున్న ఆయకట్టు భూములు.. ఒకరికి ఇవ్వాల్సిన రాయితీ మరొకరికి.. సాగు చేయకున్నా పరిహారం పొందేవారు ఒకరు..పొలం ఉన్నా పరిహారం పొందలేని  దురదృష్టవంతులు మరికొందరు.ఇటువంటి సమస్యలకు సరైన  పరిష్కారం చూపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కదులుతోంది. మొత్తం భూమిని రీ సర్వే చేయాలని యోచిస్తోంది. కోర్టు కేసులు, వివాదాలు ఉన్న భూములకు స్వల్ప కాలిక ప్రణాళికలో రీ సర్వే చేయించాలని, మొత్తం సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక సర్వే చేపట్టేందుకు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు ఏళ్ల తరబడి సమయం పట్టినా పక్కాగా రీ సర్వే చేయించాలనే దృఢసంకల్పంతో ప్రభుత్వం ఉందని సమాచారం. 

సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములను ప్రభుత్వం రీ సర్వే చేయించనుంది. రెవెన్యూతో పాటు కీలక శాఖల అధికారులు ఇప్పటికే ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించే పనిలో ఉన్నారు. తూ.గో  జిల్లాలో సహితం ఈ సర్వే జరగనుంది. ఇళ్లు, స్థలాలు, పొలాలు, తోటలు, చెరువులు.. ఇలా ప్రతి భూమినీ సర్వే చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. భూ వివాదాల పరిష్కారంతో పాటు ఆయకట్టు, ఇతర భూముల సరిహద్దులు, సర్వే నంబర్లను కచ్చితంగా పొందుపరచడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. రాష్ట్రం మొత్తంమీద అన్ని రకాల భూములనూ సర్వే చేయడం దాదాపు అసాధ్యమే అయినా.. దీనినుంచి మంచి ఫలితాలు వస్తాయ న్న భావనతో ప్రభుత్వం ఈ సర్వేకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సమగ్ర సర్వే చేయడానికి కనీసం నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుందని అం చనా. స్వల్పకాలిక, దీర్ఘకాలి క సర్వేలు చేయించాలని ప్రా థమికంగా నిర్ణయించారు. ఒకవైపు దీర్ఘకాలికంగా సర్వే చేయిస్తూనే... మరోవైపు వివా దాలు ఉన్న భూములకు స్వల్ప కాలిక సర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రయోజనాలెన్నో..
ఇళ్లు, పంట పొలాల సరిహద్దుల వద్ద పలు సందర్భాల్లో ఘర్షణలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. భూముల సర్వే వల్ల ఇటువంటి వివాదాలు చాలావరకూ సమసిపోతాయి. కొత్తగా వచ్చిన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో జరుగుతున్న మోసాలకు ఈ సర్వే వలన చెక్‌ పడనుంది. ఒకే సర్వే నంబరుతో జరిగిన రిజస్ట్రేషన్ల బాగోతాలు కూడా బయటపడనున్నాయి. భూ సర్వేతో మొత్తంగా 90 శాతం భూ వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రధానంగా ఆయకట్టు నిర్ధారణ జరుగుతుంది. ఇప్పటివరకూ పాత లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనివల్ల రైతులకు ఇచ్చే రాయితీలు.. పరిహారాల విషయంలో అనర్హులు లాభపడడం, అర్హులు నష్టపోవడం జరుగుతోంది. ఇటువంటి వాటికి ఈ సర్వే వలన చెక్‌ పడుతుంది. జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి, కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తదితర పంటలకు చెందిన భూములు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా, ఆక్వా చెరువులుగా మారిపోయాయి.

►  జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం గోదావరి మధ్యడెల్టా ఆయకట్టు 1.80 లక్షల ఎకరాలు. కానీ వాస్తవ సాగు 1.20 లక్షలు కూడా ఉండదని అంచనా. ఇరిగేషన్, వ్యవసాయ శాఖలు 1.20 లక్షల ఎకరాలను పరిగణనలోకి తీసుకుని సాగునీరు విడుదల చేయడం, వ్యవసాయ రాయితీలు ఇవ్వడం, ధాన్యం దిగుబడి అంచనా వేయడం చేస్తూంటాయి.

► తూర్పు డెల్టా ఆయకట్టు 2.70 లక్షల ఎకరాలు. కానీ ఇక్కడ వరి సాగు జరిగేది మాత్రం రెండు లక్షల ఎకరాలు కూడా ఉండదు. పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌(పీబీసీ)లో 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా వాస్తవ సాగు 22 వేల ఎకరాలు మాత్రమే. రీ సర్వేలో వాస్తవ ఆయకట్టు బయటపడనుంది.

► ఆయకట్టు మార్పులకు సంబంధించిన తాజా వివరాలు అటు ఇరిగేషన్, ఇటు వ్యవసాయ, రెవెన్యూ అధికారుల వద్ద లేవు. దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా రైతులు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారిన పొలాలు, తోటల మీద కూడా కొంతమంది పరిహారం పొందుతున్నారు. ఈ సర్వే వల్ల ప్రభుత్వానికి సహితం రాయితీ, పరిహారాల్లో కోట్లాది రూపాయల మేర ఆదా అయ్యే అవకాశముంది.
►  కబ్జాల బారిన పడిన దేవస్థానం భూములు సహితం రీ సర్వేలో బయటపడతాయి.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం
భూముల రీ సర్వేకు ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే అవకాశముంది. ఇప్పుడున్న సర్వే పరికరాల కన్నా ఆధునిక పరికరాలను రీ సర్వే కోసం వాడనున్నారు. ప్రస్తుతం రెవెన్యూలో సర్వే సిబ్బంది అంతంతమాత్రంగానే ఉన్నారు. వీరి సంఖ్యను గణనీయంగా పెంచాల్సి ఉంది. అయితే జగన్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న గ్రామ సచివాలయ వ్యవస్థలో సర్వే చేసేందుకు ఒకరిని నియమిస్తారని, తద్వారా రీ సర్వేను వేగవంతం చేస్తారని తెలుస్తోంది.

లెక్క తేల్చేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
భూముల రీ సర్వే ద్వారా ఆయకట్టు లెక్క తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనివల్ల దీర్ఘకాలికంగా సామాన్య ప్రజలు, రైతులు పలు రకాల ప్రయోజనాలు పొందే అవకాశముంది. భూ వివాదాలను చాలా వరకూ పరిష్కరించే అవకాశముంది. సమగ్ర సర్వే వల్ల మన జిల్లాలో ఆయకట్టుపై స్పష్టమైన లెక్కలు వచ్చే అవకాశముంది. ఇటీవలి కాలంలో వరి స్థానంలో ఉద్యాన పంటలు, ఆక్వా పెరిగాయి. దీనివల్ల ఆయా పంటలకు అందే ప్రయోజనాలు రైతులకు పూర్తిస్థాయిలో అందనున్నాయి.
– జిన్నూరి రామారావు, ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ సభ్యుడు, 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement