స్త్రీలకు రెట్టింపు నిధి  | AP Government That Doubled Female Funding | Sakshi
Sakshi News home page

స్త్రీలకు రెట్టింపు నిధి 

Published Tue, Dec 3 2019 11:36 AM | Last Updated on Tue, Dec 3 2019 11:36 AM

AP Government That Doubled Female Funding - Sakshi

స్త్రీ నిధి రుణంతో వాటర్‌ ప్లాంట్‌ నడుపుతున్న మహిళ

వేపాడ: మహిళా సంఘాల సభ్యుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళా సంఘాల సభ్యు లకు ఇచ్చే స్త్రీ నిధి రుణాల మంజూరు మొత్తాన్ని రెట్టింపు చేసింది. వైఎస్సార్‌ క్రాంతి పథకం కింద బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా స్త్రీ నిధి రుణం మంజూరు చేస్తోంది. జిల్లాలోని 34 మండలాల్లో ఉన్న ఏడు క్లస్టర్ల పరిధిలో 43,752 మహిళా సంఘాలు ఉన్నాయి. స్త్రీనిధి రుణ లక్ష్యం 2019–20 ఆర్థిక సంవత్సంలో 7,775 సంఘాలకు 124.66 కోట్లు కాగా, ఇప్పటి వరకు 5,944 సంఘాలకు 83.89 కోట్లు స్త్రీనిధి రుణం అందజేశారు. లక్ష్యం మేరకు రుణాలు మంజూరుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి మొ త్తాన్ని రెట్టంపు చేయడం, వడ్డీ› తగ్గింపు, వాయిదాల కుదింపుతో మహిళలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పాడిపరిశ్రమ, కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర దుకాణాలు, పండ్ల దుకాణం తదితర వ్యాపారాలకు స్త్రీ నిధి రుణం తోడ్పడుతుందని అభిప్రాయపడుతున్నారు.

స్త్రీ నిధి రుణం మంజూరు ఇలా..  
డ్వాక్రా సంఘంలో  పదిమంది సభ్యుల్లో ఇద్దరు సభ్యులకు రూ.లక్ష చొప్పున, లేదంటే నలుగురు సభ్యులకు రూ.50 వేలు చొప్పున రెండు లక్షలు పొందవచ్చు. అదే 11 మంది సభ్యులున్న సంఘంలో ఆరుగురు మహిళలు రూ.మూడు లక్షల వ్యక్తిగత రుణం తీసుకునే అవకాశం ఉంది. స్త్రీ నిధి రుణాలకు అర్హత ఉన్న సంఘాలు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో రుణం మంజూరు చేస్తారు. గతంలో వడ్డీ 12.50 శాతం ఉండేది. ప్రస్తుత జగనన్న ప్రభుత్వం 11.75 శాతానికి తగ్గించింది. గతంలో బ్యాంకు లింకేజీ రుణంగా తీసుకుంటే 60 వాయిదాల్లో చెల్లించుకునేవారు. ఇకపై 48 నెలల్లో చెల్లించుకునే వెసులబాటు కల్పించారు. సక్రమంగా వాయిదాలు చెల్లించే సంఘాలకు ప్రభుత్వమే వడ్డీ లేని రుణం మంజూరు చేస్తుంది.

మహిళలకు మేలు చేయాలనే... 
సీఎం వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రలో మహిళల ఇబ్బందులకు స్వయంగా గమనించారు. మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలనే ఉద్దేశంతో స్త్రీ  నిధి రుణం రెట్టింపు చేశారు. గత ప్రభుత్వంలో బ్యాంకు లింకేజీ  రుణం గ్రూపునకు రూ.5 లక్షలు మించి తీసుకుంటే స్త్రీ నిధి రుణం ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం రూ.ఐదు లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు రుణాన్ని డీఆర్‌డీఏ సిబ్బంది బ్యాంకు నుంచి అందజేస్తున్నారు. అంతకన్నా తక్కువ రుణం తీసుకున్న సంఘంలోని పది మంది సభ్యుల్లో ఇద్దరికి మాత్రమే  స్త్రీ నిధి  రుణం రూ.లక్ష మాత్రమే పొందే అవకాశం ఉంది. ఇద్దరికి చెరో రూ.50వేలు రుణం చాలక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని అవస్థలు పడేవారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం  కొత్తగా తీసుకున్న నిర్ణయాలు పొదుపు సంఘాల సంభ్యులకు మేలు చేకూర్చుతున్నాయి.

 పెరిగిన కేటాయింపులు: 
బ్యాంకు లింకేజీ రుణాలు, ఉన్నతి, స్త్రీనిధి, రుణాలు వసూలు చేయడం, సమావేశాలు, రికార్డుల నిర్వహణ,  సమర్ధవంతంగా పనిచేస్తున్న మండల సమాఖ్యలను ఏ, బీ, సీ, డీ గ్రేడులుగా విభజిస్తారు. గతంలో గ్రేడ్‌లు వారీగా ఇచ్చే స్త్రీనిధి మొత్తాన్ని రెట్టింపు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళల్లో ఆనందం కలిగించింది.

 ఏ గ్రేడ్‌కు ఎంత పెంచారంటే... 
ఏ–గ్రేడ్‌లోని సంఘాలకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు, బీ గ్రేడ్‌కు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు, సీ–గ్రేడ్‌కు రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు, డీ గ్రేడ్‌లోని సంఘాలకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు రుణాన్ని పెంచారు. సక్రమంగా రుణాలు చెల్లించడంతో పాటు పేదరిక నిర్మూలన సంస్థ   షరతులను సక్రమంగా అమలు చేస్తే సంఘాలకు అదనంగా నిధులు మంజూరు చేస్తారు.

 ప్రథమ స్థానంలో ఎస్‌.కోట...  
జిల్లాలోని 7 ఏసీ క్లస్టర్ల పరిధిలో ఎస్‌.కోట క్లస్టర్‌లోని 1464 సంఘాలకు రూ.25.43 కోట్లు రుణ లక్ష్యంకాగా.. ప్రోగ్రెస్‌లో ఉన్న వాటితో కలిపి 1716 సంఘాలకు 25.79 కోట్ల రుణాలు మంజూరు చేసి జిల్లాల్లో 101.42 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. పార్వతీపురం క్లస్టర్‌ రూ.63.44 కోట్లు రుణం ఇచ్చి ఆఖరు స్థానంలో నిలిచింది.   

ఆనందం రెట్టింపు  
మహిళా సంఘాల స భ్యులకు స్త్రీనిధి రుణం రెట్టింపు చేయడం ఆనందంగా ఉంది. చిన్నచిన్న వ్యాపారాల తో ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కలి గింది. బయట అప్పులు చేసుకునే అవసరం లేదు. వాయిదాలు సకాలంలో కడితే వడ్డీ రాయితీ వస్తుందని చెబుతున్నారు. 
– భోజంకి మాధవి, సంఘసభ్యులు, వేపాడ 

స్వయం ఉపాధికి ఊతం  
స్త్రీనిధి రుణాల మంజూరుతో పొదుపు సంఘాల మహిళల స్వయం ఉపాధికి ఊతం లభిస్తుంది. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా స్త్రీ నిధి రుణం ఇవ్వడం, గతంలో కంటే సభ్యులను పెంచడం, రెట్టింపు రుణం ఇవ్వడం చాలా మంచినిర్ణయం. మహిళలు ప్రైవేటు అప్పులు చేసే అవసరం ఉండదు. రుణాలతో వ్యాపారపురోగతి సాధించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో స్త్రీ నిధి లక్ష్యం చేరువలో ఉన్నాం. నేటికి ప్రోసెస్‌లో ఉన్న నంఘాలతో కలిపి 88.95 శాతం లక్ష్యం చేరుకున్నాం. ఎస్‌.కోట క్లస్టర్‌ మొదటి స్థానంలో నిలిచింది. స్త్రీనిధి రుణం రెట్టింపు వల్ల మహిళలకు ఆనందం కలుగుతోంది.  
–  కె.సుబ్బారావు, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్‌డీఏ, విజయనగరం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement