సాక్షి, కడప : మూగప్రాణులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులు, గొర్రెలు, మేకల యజమానులు, పెంపకం దారులకు ఆసరాగా నిలిచేందుకు వైఎస్సార్ పశుసంరక్షణ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్య సంరక్షణ కార్డులు అందించి పశువులు, గొర్రెలు, మేకల ఆరోగ్యాన్ని సంరక్షించనుంది. జిల్లా వ్యాప్తంగా యానిమెల్ హెల్త్‌కార్డుల ద్వారా లక్షమంది పశుసంద కలిగిన రైతులకు, గొర్రెల యజమానులకు, కాపరులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో 75 వేల పెద్దపశువులు, 25 వేల మంది గొర్రెలు, మేకల యజమానులకు, కాపరులకు దీని ద్వారా కార్డులందించనున్నారు. గ్రామ సచివాలయానికి అనుసందానంగా పశువైద్య సహాయకులు ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం పశుసవర్ధకశాఖ 085–00–00–1962, రైతుభరోసా కేంద్రాల టోల్‌ఫ్రీ నంబరు 1907కు కాల్ చేయవచ్చు.
75వేల పెద్దపశువులకు.. 25వేల జీవాలకు కార్డులు
జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష పశువులకు హెల్త్ కార్డులు అందించాలని జిల్లా పశుసంవర్ధకశాఖ నిర్ణయించింది. కార్డుల్లో ప్రధానంగా పశువుల ఆరోగ్య సంరక్షణ కు చర్యలు, కృత్రిమ గర్భధారణ, సూడి పశువులు, దూడలు, టీకాలు, పశుపోషకాలు, పశుసంపద వివరాలను నమోదు చేస్తారు. రైతుభరసా కేంద్రాల వద్ద పశువుల బోనులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 620 కేంద్రాల వద్ద వీటిని ఈ బోన్లు నిర్మించారు.
పశునష్ట పరిహార పథకం ఇలా..
వైఎస్సార్ పశు నష్టపరిహార పధకాన్ని పునరుత్పాదక దశలో 2 నుంచి 10 ఏళ్ల వయసున్న ఆవులు, 3 నుంచి 12 ఏళ్ల వయసున్న బర్రెలకు వర్తింప చేస్తారు. పశువు మరణిస్తే మేలుజాతి స్వదేశీ ఆవు ఒక్కింటికి రూ.30 వేలు, దేశవాళీ బర్రె మరణిస్తే రూ.15వేల పరిహారం అందిస్తారు. ఏడాదికి ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.1.50లక్షల వరకు పరిహారం పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆరునెలల నుంచి ఆపై వయసున్న గొర్రెలు, మేకలకు పధకం వర్తింపచేశారు. ఒకేసారి మూడు నుంచి అంతకన్నా ఎక్కువ జీవాలు మరణించినప్పుడు పధకాన్ని అందిస్తారు. ప్రతి జీవానికి రూ.6వేలతో ఏడాది కుటుంబానికి గరిష్టంగా రూ.1.20లక్షల వరకు పరిహారం అందుతుంది.
కార్డుల పంపిణీ చేపట్టాం
పశువులకు, జీవాలకు హెల్త్‌కార్డులను రైతులకు పంపిణీ చేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా వీటిని అందిస్తున్నాం. పశువుకు సంబంధించిన ప్రతి విషయం కార్డులో అసిస్టెంట్లు రాస్తారు. ఈ కార్డులు నాలుగేళ్లు పనిచేస్తాయి. జిల్లా వ్యాప్తంగా పాడిరైతులు, గొర్రెలు, మేకల పెంపకందార్లకు కార్డులు అందించేలా చర్యలు తీసుకున్నాం. ఒక కుటుంబానికి ఒక కార్డు చొప్పున అందిస్తారు.
–వీఎల్‌ఎస్ సత్యప్రకాష్, సంయుక్త సంచాలకులు, జిల్లా పశుసంవర్ధకశాఖ, కడప
Comments
Please login to add a commentAdd a comment