
సాక్షి, అమరావతి: దిశ పథకం అమలుకు పాలనా అనుమతులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.47.93 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో దిశ పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర హోంశాఖ తెలిపింది. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
హోంశాఖ ఆదేశాల నేపథ్యంలో పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధానికి, పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కమిటీలో ఏడుగురు అధికారులు, సిబ్బంది ఉంటారని తెలిపారు. ‘దిశ’ చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
Comments
Please login to add a commentAdd a comment