ఆగ్రహించిన అన్నదాత
ఏపీ సర్కారు తీరుపై మండిపడ్డ రైతులు, డ్వాక్రా మహిళలు
సాక్షి యంత్రాంగం: ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలు, డ్వాక్రా మహిళలు రోడ్డెక్కారు. అప్పులన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెప్పి, ముఖ్యమంత్రి కాగానే మాట మార్చిన చంద్రబాబు నాయుడు వైఖరిపై నిప్పులు చెరిగారు. ఖరీఫ్ సీజన్ దాటిపోతున్నా రుణమాఫీ చేయకుండా కమిటీలంటూ కాలయాపన చేస్తూ, రోజుకో మాట మార్చుతున్న టీడీపీ సర్కారు వైఖరిపై ఆగ్రహోదగ్రులయ్యారు. రూ.87వేల కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.14వేల కోట్ల డ్వాక్రా రుణాల్లో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా, మాయమాటలు చెప్తూ అంతా చేసేసినట్లు అనుకూల మీడియాలో డప్పు కొట్టించుకుంటున్నా సీఎం వైఖరిపై మండిపడ్డారు. మూడురోజుల పాటు తప్పుడు హామీల నరకాసుర వధ కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రెండోరోజు రాష్ట్రవ్యాప్తంగా ‘నరకాసుర వధ’ నిర్వహించారు.
గ్రామాగ్రామాన భారీగా ఆందోళనలు నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేశారు. అన్నదాతను, ఆడపడుచులను మోసం చేసిన ముఖ్యమంత్రిపై 420 కేసు పెట్టాలని నినదించారు. మొత్తం రుణాలు మాఫీ చేస్తామని హామీలిచ్చి ఓట్లేయించుకుని ఇప్పుడు మాటమార్చి మాయచేయాలని చూస్తే సహించబోమని, తగిన గుణపాఠం చెబుతామని అనంతపురం జిల్లాలో ఒక రైతు హెచ్చరించారు. ‘‘అప్పులు మాఫీ చేస్తామంటే కట్టకుండా మానేశాం. ఇప్పుడు కట్టాలన్నా డబ్బుల్లేవు. బ్యాంకుకు వెళితే గత ఏడాదికి కూడా 13శాతం వడ్డీ కట్టాల్సిందేనంటున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి నిండా మునిగిపోయాం’’ అని చిత్తూరుజిల్లాకు చెందిన ఒక డ్వాక్రా మహిళ ఆవేదన వ్యక్తంచేసింది. మాట తప్పిన తెలుగుదేశం పార్టీ సర్కారు మెడలు వంచుతామని రాష్ట్రవ్యాప్తంగా రైతులు, డ్వాక్రా మహిళలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు నినదించాయి. అనంతపురంజిల్లాలో సీపీఐ కూడా రుణమాఫీపై ఉద్యమించింది. విపక్షాల ఆందోళనలు చూసి భయపడిన అధికారపక్షం అనేకచోట్ల ఆందోళనలు అడ్డుకునేందుకు ప్రయత్నించింది.