‘ఏపీలో మళ్లీ ఉద్యమాలు’
విజయనగరం: ఉత్తరాంధ్రపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమరావతి చుట్టే అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో మళ్లీ ఉద్యమాలు వచ్చే అవకాశముందని హెచ్చరించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి బతికివుంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేవని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రెండు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ నమ్మరని కొణతాల రామకృష్ణ అన్నారు.