సాక్షి, అమరావతి : లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది డిసెంబర్ 15న నోటిఫికేషన్ వెలువరిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించినా ఇప్పటివరకు ఆ జాడ లేదు. పోస్టుల సంఖ్యపై ఇప్పటికీ తుది నిర్ణయానికి రాలేదు. దాదాపు 14 వేల పోస్టుల వరకు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలకు అదనంగా మరో 3600 పోస్టుల వరకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ ఫైలు ఇంకా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే ఉంది. మరోవైపు అభ్యర్థులు వేలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నారు. పోటీ ఎక్కువగా ఉన్నందున పోస్టు వస్తుందో, రాదో అనే ఆందోళనతో ఉన్నారు. వీరు ప్రభుత్వం తీరు చూసి మరింత బెంబేలెత్తుతున్నారు.
ప్రభుత్వం అదనపు పోస్టులకు ఆమోదం తెలపకపోవడమే కాకుండా డీఎస్సీలో 14 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వడమంటూ మెలికపెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఏటా డీఎస్సీ వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో 10,313 పోస్టులతో ఒకే ఒక్క డీఎస్సీని నిర్వహించింది. ఇప్పుడు 14 వేల పోస్టులకు ఒకేసారి డీఎస్సీ పెట్టే బదులు పోస్టులను తగ్గించి రెండు డీఎస్సీలు వేస్తే బాగుంటుందన్న ఆలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అసలు ఖాళీలే లేవని పేర్కొంటూ వచ్చిన ప్రభుత్వం 9,800 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి రాతపూర్వకంగా తెలిపింది.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 2017, మే 2018, డిసెంబర్ 2018 వరకు ఉన్న/ఉండే ఖాళీలను పరిగణనలోకి తీసుకొని దాదాపు 12,500 వరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటికి మరిన్ని పోస్టులు కలపాలని నిర్ణయించినా ఇప్పటివరకు ప్రభుత్వ ఆమోదం రాలేదు. తమ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉంటాయో తెలియక అభ్యర్థులు తికమకపడుతున్నారు. తమ జిల్లాలో ఎక్కువ ఖాళీలు లేకపోతే, పక్క జిల్లాకు వెళ్లి స్థానికేతర అభ్యర్థిగా పరీక్ష రాయడానికి వీలున్నా రెండూ ఒకేసారి రాయడం కష్టం. ఏదో ఒక జిల్లాకే పరిమితం కావాలి. ఆ స్థానికేతర జిల్లాలో పోటీ తీవ్రంగా ఉంటే 20 శాతం కోటాలో అవకాశాలు మరింత సన్నగిల్లిపోతాయి.
ఇతర జిల్లాల్లోని ఓపెన్ కేటగిరీకి అర్హత కల్పించాలి
పరీక్ష ఎక్కడ రాసినా ఇతర జిల్లాల పోస్టుల్లో ఓపెన్ కేటగిరీ కోటాకు అర్హత కల్పిస్తే బాగుంటుందని అభ్యర్థులు కోరుతున్నారు. అక్కడ ఏ అభ్యర్థి అయినా తన సొంత జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసి తీవ్ర పోటీ వల్ల ఉద్యోగం సాధించనట్లయితే ఇతర జిల్లాల్లో అతడి మార్కులను బట్టి 20 శాతం కోటాలో స్థానికేతరుడిగా పరిగణించి అవకాశం కల్పిస్తున్నారు. ఇలాంటి విధానం రాష్ట్రంలో లేనందువల్ల 2014 డీఎస్సీలో చాలామంది మెరిట్ అభ్యర్థులు కొద్ది తేడాతో ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయారు. ఉదాహరణకు పశ్చిమగోదావరికి చెందిన ఒక అభ్యర్థిని 136 మార్కులు సాధించి ఉద్యోగం పొందలేకపోయారు. కానీ విశాఖ, చిత్తూరుల్లో ఆమె కంటే తక్కువ మార్కులు వచ్చినవారు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందారు. కాబట్టి సొంత జిల్లాలో పరీక్ష రాసినా మార్కులను బట్టి ఇతర జిల్లాల్లోని ఓపెన్ కేటగిరీలో కూడా పోస్టులు కేటాయించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment