
'శివరామకృష్ణన్ కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి'
ఒంగోలు: తాము చెప్పిన ప్రాంతంలోనే నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుకు శివరామకృష్ణన్ కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంలోనే ఏపీ రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తామని శివరామకృష్ణన్ కమిటీ హామీ ఇచ్చిందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం మాని చిత్తశుద్దితో రైతులకు రుణమాఫీ చేయాలిని కోరారు.
కాగా, వెనుకబడిన ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కె.సి.శివరామకృష్ణన్ కమిటీకి అంతకుముందు సుబ్బారెడ్డి నివేదించారు. రాజధానిని అటు ఆంధ్రా అయినా, ఇటు రాయలసీమ అయినా వెనుకబడిన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధాని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు రెండింటి మధ్య ఉంటే ఇరు ప్రాంతాల ప్రజలూ హర్షిస్తారని అభిప్రాయపడ్డారు.