సాక్షి, అమరావతి: కోవిడ్–19 వైరస్ వ్యాప్తి నిరోధించడానికి, సమాజం సురక్షితంగా ఉండటానికి ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకునే విధంగా అన్ని ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆరోగ్య కార్యకర్తలు, పారా మిలటరీ, కోవిడ్–19 వైరస్ బాధితులకు దగ్గరగా ఉండేవారు, వార్డు, విలేజ్ వాలంటీర్లు, ఆశ, ఏఎన్‌ఎంఎస్, అంగన్‌వాడీ, శానిటరీ, బ్యాంక్, మీడియా ప్రతినిధులు, ప్రజలతో సన్నిహితంగా ఉండే వ్యాపారులు, డ్రైవర్లు, వ్యవసాయ కూలీలు, పనికి ఆహార పథకం కూలీలు, పరిశ్రమల్లో పనిచేసే సిబ్బంది, వాణిజ్య సముదాయాల్లో పనిచేసేవారు, ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
24 గంటల్లోగా ‘టెలీ మెడిసిన్’ పంపిణీ
‘టెలీ మెడిసిన్’ విధానం కింద వైద్యులు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24 గంటల్లోగా సంబంధిత వ్యక్తులకు మందులు పంపిణీ అయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కలెక్టర్లను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జాయిట్ కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సీఎస్ ఏమన్నారంటే..
► కరోనా నేపథ్యంలో ప్రారంభించిన టెలీ మెడిసిన్ విధానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సేవల కోసం సంప్రదించిన వారికి వైద్య సేవలతో పాటు మందులు సరైన సమయంలో అందితేనే ప్రయోజనం కలుగుతుంది.
► పీహెచ్‌సీలు, ఇతర ఆస్పత్రుల్లో ఓపీ కేసుల్ని తగ్గించేందుకు టెలీ మెడిసిన్ ఉపయోగపడుతుంది.
► ఇంటింట సర్వేలో కరోనా అనుమానిత లక్షణాల్ని గుర్తించిన వారందరికీ త్వరగా పరీక్షలు పూర్తి చేయాలి.
► గ్రీన్ జోన్లలోని పరిశ్రమలన్నీ ప్రారంభమయ్యేలా చూడాలి. మే 3 తర్వాత కంటైన్మెంట్ ప్రాంతాల్లో అనుసరించాల్సిన విధానంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి.
► వీడియో సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, సీఆర్డీఏ అదనపు కమిషనర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment