సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు (ఆప్కాబ్) అక్టోబర్ రెండో తేదీ నుంచి రెండుగా విడిపోనుంది. అప్పటివరకు ఒకటిగానే కొనసాగనుంది. ఈమేరకు ఏప్రిల్ 26న ఆప్కాబ్ బోర్డు చేసిన తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఆమోదించారు. ఆప్కాబ్‌ను రెండుగా విభజించడానికి మరో ఆరు నెలల సమయం పడుతున్నందున, అప్పటి వరకు నాబార్డు, ఆర్‌బీఐలు యథావిధిగా రుణసాయం అందించడంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా గవర్నర్ సిఫారసు చేయాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి దాసరి శ్రీనివాసులు కోరారు. దీనికి గవర్నర్ అంగీకరించారు.
ఈ మేరకు బోర్డులో తీర్మానం ఆమోదించి పంపించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆప్కాబ్‌ను షెడ్యూల్ తొమ్మిదిలో కాని, షెడ్యూల్ పదిలో కాని చేర్చలేదని గవర్నర్ దృష్టికి తీసుకుని వస్తూనే.. ఆప్కాబ్ బోర్డు సహకార బ్యాంకును రెండుగా విభజించాలని తీర్మానించినట్టు ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలకు గాను తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకును, మిగిలిన 13 జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు ఉంటుందని శ్రీనివాసులు వివరించారు.