కాంగ్రెస్ పాదయాత్రతో టీడీపీ గుండెల్లో రైళ్లు | apcc fire on cm chandra babu on false allegations | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పాదయాత్రతో టీడీపీ గుండెల్లో రైళ్లు

Published Wed, Oct 19 2016 4:53 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ పాదయాత్రతో టీడీపీ గుండెల్లో రైళ్లు - Sakshi

కాంగ్రెస్ పాదయాత్రతో టీడీపీ గుండెల్లో రైళ్లు

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే తమకు నూకలు చెల్లుతాయని హడలిపోతున్నారని అందుకే టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు అవాకులు, చవాకులు పేలుతున్నారని ఏపీసీసీ అధికార ప్రతినిధి డా.ఎన్.తులసిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్లు మండిపడ్డారు. ఇందిరాభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఏపీసీసీ అధ్యక్షుడు డా.ఎన్.రఘువీరారెడ్డి గతంలో వ్యవసాయం మంత్రిగా ఉన్నప్పుడు మేఘమథనంలో అవినీతి జరిగినట్లు టీడీపీ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.  2014 అక్టోబర్ 8న రఘువీరారెడ్డి మేఘమథనం, ఇతర ఆరోపణలపై న్యాయవిచారణకు ఆదేశించాలని సీఎం చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాసినట్లు ఈ సందర్భరంగా గుర్తుచేశారు.

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేఖ విధానాలకు పాల్పడుతుండటం శోచనీయమన్నారు. ఒకవైపు అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని, ఏపీని 2022 కల్లా దేశంలో 3 అభివృద్ధి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 కల్లా దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా, 2050 కల్లా ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు రైతులకు బుట్టశనగ విత్తనాలు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉండటం దురదృష్టకరమన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.5వేల కోట్లతో మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ను ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాట ధర లేనప్పుడు ఆదుకుంటామని హామీనిచ్చి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లిగడ్డ రైతులు పంట పండి కొనేనాధుడు లేక లబోదిబోమంటుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండి పోవడం రైతుల నోట్లో మట్టికొట్టడమేనన్నారు. తన కార్యాలయ సోకుకు, విదేశీయాత్రలకు, ప్రత్యేక విమానాలకు, గోదావరి, కృష్ణా పుష్కరాలకు, రాజధాని భూమి పూజకు, శంకుస్థాపనకు, తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు దుబారా చేస్తున్న ముఖ్యమంత్రి రైతుల వద్దకు వచ్చేసరికల్లా చేతులు రాకపోవడం బాధాకరమన్నారు.

గత మూడేళ్లుగా రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిబీ ఇవ్వలేదని, రుణమాఫీ ఒక ప్రహసనంగా మారిపోయిందని, వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యంలో 50 శాతం కూడా దాటలేదన్నారు. కడప జిల్లాలో 2012-13 రబీకి సంబంధించి పంటల బీమా సొమ్ము ఇప్పటివరకు ఇవ్వలేదని, మేనిఫెస్టోలో చెప్పినట్లు ఎంఎస్ స్వామినాధన్ నివేదికను అమలు చేయకుండా బుట్ట దాఖలు చేశారన్నారు. రైతుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేఖత నివురుకప్పిన నిప్పులా ఉందని, ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు రైతు సమస్యలపై పాదయాత్ర చేస్తుంటే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని ఆ స్పీడును తట్టుకోలేక వారి నోటికి ఇష్టం వచ్చినట్లు హద్దూపొద్దూ లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఇదే విషయమై మరొక్క సారి సవాల్ చేస్తున్నాం... ఇప్పటికైనా విచారణ జరిపి నిగ్గు తేల్చండి లేదా నోరు మూసుకోండి అని ఏపీసీసీ హెచ్చరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement