ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: విభజన పీడ తొలగిపోవాలని కోరుతూ ఏపీ ఎన్‌జీవో నాయకులు తెలంగాణ నోట్ బిల్లు ప్రతులను భోగిమంటల్లో దహనం చేశారు. ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ అశోక్‌బాబుతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. బిల్లు ప్రతులు దహనం చేసిన అనంతరం ఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బషీర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మచిలీపట్నం ఎంపీ కే నారాయణరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేదని, ఒకరి నాయకత్వాన్ని మరొకరు ఒప్పుకోరన్నారు. ఎన్‌జీవోలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నారని వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భోగి రోజు ఇంట్లోని పనికిరాని వస్తువులను తగులబెడుతుంటారని, ప్రజలమధ్య చిచ్చుపెట్టిన టీ నోట్ బిల్లును ద హనం చేయడాన్ని సమర్ధించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే సోనియాగాంధీ విభజన నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. సభలో ఎవరేమన్నారంటే...
రావణకాష్టాన్ని రగిల్చారు: దారా సాంబయ్య, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు
రాష్ట్రంలో విభజన అనే రావణకాష్టాన్ని రగిల్చి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించారని మాజీ శాసనసభ్యుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దారా సాంబయ్య విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలికి రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు తెలుసా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సెకండ్ ఎస్సార్సీ ఏర్పాటు చేయాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు.
తప్పుడు రిపోర్టుతో రోశయ్యను భయపెట్టారు: కరణం బలరాం, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిరాహారదీక్ష సమయంలో తెలంగాణ కు చెందిన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నాటి ముఖ్యమంత్రి రోశయ్యకు తప్పుడు రిపోర్టు ఇచ్చి భయపెట్టారని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి తెలిపారు. తెలంగాణ ఉద్యమం రాజకీయ నిరుద్యోగులు చేసిందని, సీమాంధ్రలో ప్రజల నుంచి ఉద్యమం వచ్చిందన్నారు.
పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తా : మాగుంట
తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. మాలో సఖ్యత లేదు, సమైక్యత అంతకంటే లేదు. ఇది నిజమన్నారు. పార్లమెంటులో బిల్లు ఓడించిన తరువాత నిజమైన సంక్రాంతి చేసుకుందామన్నారు.
కాళ్లు పట్టుకొని మద్దతు కోరతాం: కందుల
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని జాతీయ పార్టీల నాయకుల కాళ్లు పట్టుకొని మద్దతు కోరతామని మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డి తెలిపారు. విభజన జరిగితే జిల్లా తీవ్రంగా నష్టపోతుందన్నారు.
విభజన చరమాంకంలో ఉన్నాం: చలసాని శ్రీనివాసరావు, మేధావుల ఫోరం వేదిక కన్వీనర్
విభజన ప్రక్రియకు సంబంధించి చరమాంకంలో ఉన్నామని మేధావుల ఫోరం వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు పేర్కొన్నారు. సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు తన గుండెను చూపించి కాల్చమన్న ధీరశాలి ప్రకాశం పంతులు అని, ఆయన నివసించిన ప్రాంతం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు.
సమైక్యాంధ్రకు కట్టుబడనివారిని చిత్తుగా ఓడించాలి: విద్యాసాగర్, కృష్ణా జిల్లా ఎన్‌జీవో అసోసియేషన్ నాయకుడు
అసెంబ్లీలో సమైక్యాంధ్రకు కట్టుబడని శాసనసభ్యులను ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కృష్ణా జిల్లా ఎన్‌జీవో అసోసియేషన్ నాయకుడు విద్యాసాగర్ కోరారు. స్వాతంత్య్ర ఉద్యమం తరువాత అంతస్థాయిలో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగిందన్నారు.
తెలంగాణ బిల్లు అడ్డుకోవాలి: శ్రీరాం, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకుడు
తెలంగాణ బిల్లు అసెంబ్లీ దాటి వెళ్లకుండా అడ్డుకోవాలని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకుడు శ్రీరాం కోరారు. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్‌తో సహా తెలంగాణ , రాయలసీమ, కోస్తాంధ్రలు నష్టపోతాయన్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుగా రాజీనామా చే యాల్సింది: బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణపై నిర్ణయం వెలువడిన వెంటనే సీమాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుగా రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదికాదని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
టీ నోట్ మరణశాసనం : అబ్దుల్ బషీర్, ఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
మరణశాసనంగా మారిన టీ నోట్‌ను అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఏపీఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌బషీర్ కోరారు. ఈనెల 17 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న శాసనసభ సమావేశాల్లో ఏకవాక్య తీర్మానంతో టీ నోట్‌ను తిప్పిపంపాలన్నారు.
ఢిల్లీ పెద్దల నిర్ణయాన్ని తిప్పికొట్టాలి: శివరమేష్‌రెడ్డి, లోక్‌సత్తా రాష్ట్ర నాయకుడు
రాష్ట్ర విభజనకు సంబంధించి ఢిల్లీ పెద్దల నిర్ణయాన్ని తిప్పికొట్టాలని లోక్‌సత్తా రాష్ట్ర నాయకుడు అల్లు శివరమేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. విభజనకు సంబంధించి శాసనసభ్యులకు గౌరవం ఇవ్వకుండా ఏకపక్షంగా చేయడాన్ని తప్పుపట్టారు. ప్రజలమధ్య వైషమ్యాలు పెంచారన్నారు.
కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ రాష్ట్రనాయకుడు బత్తిన నరసింహారావు, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు,డాక్టర్స్ జేఏసీ నాయకుడు రాజేంద్రప్రసాద్, సమైక్యాంధ్ర పరిరక్షణ నాయకుడు లంకా దినకర్, ఉపాధ్యాయ సంఘ ం తరఫున వెంకటరావు, న్యాయవాదుల తరఫున సిరిగిరి రంగారావు, ఆర్టీసీ తర ఫున కోటేశ్వరరావు, కాలేజస్ తర ఫున గోరంట్ల రవికుమార్, విద్యార్థుల తరఫున ఆర్ జగదీష్ పాల్గొన్నారు.
విభజన పీడ పోవాలని...
Published Tue, Jan 14 2014 2:08 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement