
హైదరాబాద్‌లో 7న జరిగేది 23 జిల్లాల సమైక్య సభ: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ అవగాహనా సదస్సు’ కేవలం 13 జిల్లాల సభ కాదని, రాష్ట్రంలోని 23 జిల్లాల సభ అని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. సమైక్యవాదాన్ని వినిపించే ఈ సభలో అన్ని ప్రాంతాలవారు పాల్గొంటారని చెప్పారు. వివిధ ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రైవేటు ఉద్యోగుల సంఘాల నాయకులు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్ల జేఏసీ నేతలతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు.
అనంతరం ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఆర్టీసీ ఈయూ సీమాంధ్ర పోరాట కమిటీ చైర్మన్ సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. తాము నిర్వహించ తలపెట్టిన సభకు ఇప్పటి వరకు అనుమతి రాలేదన్నారు. అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించనున్నామని చెప్పారు. సభను శాంతియుతంగా నిర్వహిస్తామని ప్రభుత్వానికి, హైకోర్టుకు హామీ ఇవ్వనున్నామని తెలిపారు. తాము తెలంగాణవాదానికి, ఉద్యమానికి వ్యతిరేకం కాదని, ఎవరినీ కించపరచడానికి ఈ సభను పెట్టడం లేదని, అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. తమ సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. ఇప్పటి వరకు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామీల మీద అనుమానం కలిగే అవకాశం ఉందని అశోక్‌బాబు అన్నారు. సమైక్యవాదాన్ని నమ్మినవాళ్లంతా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు కూడా సభకు రావచ్చని, అయితే పార్టీ రహితంగా రావాలని సూచించారు.
సమన్వయ కమిటీ ఏర్పాటు: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు అశోక్‌బాబు అధ్యక్షతన 25 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటైంది. సభ తర్వాత అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి దాదాపు ఇదే కమిటీని సమైక్య ఉద్యమ జేఏసీగా మార్చనున్నారు. కమిటీ కోచైర్మన్లుగా పి.దామోదరరావు(ఆర్టీసీ ఈయూ), ఆర్వీఎస్‌ఎస్‌డీ ప్రసాదరావు (ఆర్టీసీ ఎన్‌ఎంయూ) ఎస్వీబీ రాజేంద్రప్రసాద్ (ఈయూ), పి.వి.రమణారెడ్డి (ఎన్‌ఎంయూ), కమలాకర్ (టీచర్స్ ఫెడరేషన్), వి.శ్రీకాంత్‌రెడ్డి (ఎస్వీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్), నరసింహారావు (నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్), బొప్పరాజు వెంకటేశ్వర్లు (ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్), ఎ.వెంకటేశ్వరరావు (ఇండస్ట్రియలిస్టుల ఫోరం), బి.మధుసూదన్‌రెడ్డి (సినీ నిర్మాత), ఎం.వంశీకృష్ణ (జర్నలిస్టుల అసోసియేషన్), జాయింట్ కన్వీనర్లుగా ఎన్.చంద్రశేఖరరెడ్డి (ఏపీఎన్జీవో), డాక్టర్ కె.రాజేంద్ర (డాక్టర్స్ అసోసియేషన్), కె.శ్రీనివాసరెడ్డి (విశాలాంధ్ర మహాసభ), ఎం.జయకర్ (అడ్వొకేట్స్ అసోసియేషన్), ఎ.విజయ్‌కుమార్ (ఫ్యాప్సియా) కె.విజయ్‌కుమార్ (దళిత ఫోరం), కె.చిరంజీవిరెడ్డి (ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్), జి.కుమార్‌చౌదరి యాదవ్ (సమైక్య ఏపీ సంరక్షక పార్టీ), కో-కన్వీనర్లుగా డేవిడ్ (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అసోసియేషన్), దినకర్ (సీఏల సంఘం), హేమలత (ఆలిండియా మహిళా సంఘం), కె.నాగరాజు (ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్), ఎన్.శ్రీహరి (సమైక్య రాష్ట్ర సంరక్షణ సమితి) నియమితులయ్యారు. హైకోర్టు అడ్వొకేట్ సి.వి.మోహన్‌రెడ్డి, బార్‌కౌన్సిల్ సభ్యుడు కె.చిదంబరం, ఆంధ్ర మేధావులసంఘం నాయకుడు చలసాని శ్రీనివాస్ సలహాదారులుగా వ్యవహరిస్తారు.