ఆర్టీసీ ఉద్యోగాలకు ఎసరు
జాబు కావాలంటే.. బాబు రావాలి.. అంటూ టీడీపీ నాయకులు ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలకూ ఎసరుపెడుతూ వారి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. తాజాగా అంతర్‌రాష్ట్ర ఒప్పందంతో తెలంగాణ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గింపు నిర్ణయంతో 14 వందల మంది ఉపాధి కోల్పోనున్నారు. కాగా, మూడేళ్ల చంద్రబాబు పాలనలో ఆర్టీసీలో మూడువేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
► అంతర్‌రాష్ట్ర ఒప్పందం పేరుతో 221 బస్సుల తగ్గింపు
► వీధినపడనున్న 1400 మంది ఉద్యోగులు
► పల్లె వెలుగు సర్వీసుల కుదింపుతో
► ఏడొందలమంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఉపాధి కరువు
► పనిష్మెంట్ పేరుతో మరికొందరు ఉద్యోగాల నుంచి తొలగింపు
► మూడేళ్లలో మూడు వేల మంది కార్మికుల ఇంటి బాట
సాక్షి : రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రాకు 11,500 పైగా బస్సులతో 60 వేలమంది ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి అప్పులతో వచ్చిన ఆర్టీసీకి మూడేళ్ల నుంచి భారీ నష్టాలు రావడంతో సంస్థ మరింత అప్పుల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం తెచ్చిన రుణాలకు వడ్డీ చెల్లించలేని స్థితిలో ఉంది. ఈ క్రమంలో ఆర్టీసీని ఆదుకోవాల్సిన సర్కార్ పథకం ప్రకారం సంస్థను నిర్వీర్యం చేస్తోంది. ఈ క్రమంలోనే మూడేళ్ల కాలంలో 60 వేల ఉద్యోగుల్లో మూడువేల మందిని ఉద్యోగాల్లోంచి తొలగించింది.
ఉద్యోగులకు ఎసరు ఇలా..
ఆర్టీసీ నష్టాల్లో ఉందని సాకు చూపి పల్లె వెలుగు బస్సులను తగ్గించారు. దీనివల్ల దాదాపుగా 700 వందలమంది కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలు పోయాయి. పనిష్మెంట్‌ల పేరుతో 1000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వారందరి ఉద్యోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణలో బస్సులు తిరిగే దూరాన్ని ఏపీఎస్ ఆర్టీసీ 20 వేల కిలోమీటర్లకు తగ్గించింది. దీని కారణంగా మరో 1300 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలా మూడేళ్లలో మూడు వేల మంది కార్మికులు ఉద్యోగాలు పోగొట్టుకుని పూటగడవని స్థితిలో అల్లాడిపోతున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు.
అంతర్‌రాష్ట్ర ఒప్పందంతో ఎసరు
అంతర్‌రాష్ట్ర ఒప్పందం పేరుతో మరో 221 బస్సులను తెలంగాణ వైపు వెళ్లకుండా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బస్సుల కుదింపుతో ఆర్టీసీకి భారీ నష్టంతో పాటు మూడు డిపోలు మూతపడే అవకాశం ఉంది. ఈ ఒప్పందం అమలయితే మరో 14 వందల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రోజూ దాదాపు 800 బస్సులు.. 3.30 లక్షల కిలోమీటర్ల మేరకు రాకపోకలు సాగించేవి. తెలంగాణ నుంచి ఆంధ్రాకు 100 బస్సులు.. లక్ష కిలోమీటర్లు రాకపోకలు సాగించేవి. తెలంగాణలో బస్సులు తిరిగే దూరాన్ని ఏపీఎస్ ఆర్టీసీ 20 వేల కిలోమీటర్లకు తగ్గించింది. తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు అనుమతులు లేకున్నా బస్సుల సంఖ్య పెంచుకుంది.
1.45 లక్షల మేరకు బస్సులు నడుపుతోంది. దీంతో తెలంగాణ ఆదాయం తగ్గిపోతుండటంతో అంతర్‌రాష్ట్ర ఒప్పందం మేరకు ఆంధ్రప్రదేశ్ బస్సులు తిరిగే దూరాన్ని తగ్గించాలని తెలంగాణ ఒత్తిడి తెచ్చింది. తెలంగాణ రాష్ట్రం పన్ను వేసే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. ఈ క్రమంలోనే 221 బస్సులను తగ్గించే ఒప్పందం చేసుకున్నట్లు అధికార వర్గాల వాదన. ఒక్క కృష్ణా జిల్లాలోనే అత్యధికంగా 70 బస్సులు తగ్గిపోయే అవకాశం ఉంది.
దీనివల్ల దాదాపు 14 వందల మంది కార్మికులు ఉపాధి పొగొట్టుకోనున్నారు. మరో రెండు నెలల్లో ఆరు వందల మంది ఉద్యోగ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్తవారి నియామకం చేపట్టకపోగా ఉన్నవారితోనే సర్దుబాటు చేసే యత్నం చేస్తున్నారు. తమను పరిగణనలోకి తీసుకోకుండా ఆర్టీసీకి నష్టం కల్గించేలా యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.