
సాక్షి, తిరుపతి అర్బన్: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రైళ్లలో వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు టికెట్లను ఇకపై రైళ్లలోనే ఇవ్వనున్నారు. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించనున్నారు. దీంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వైపు నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఆర్టీసీ కండక్టర్ గూడూరు నుంచి తిరుపతి వరకు వస్తూ ఏసీ బోగీలతో పాటు స్లీపర్ క్లాస్ బోగీలలో తిరుమలకు వెళ్లే యాత్రికులకు రైలులోనే ఆర్టీసీ బస్సు టికెట్లను విక్రయిస్తారు.
ప్రయాణికులు రైలు దిగగానే ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే మిగిలిన అన్ని మార్గాల్లోని రైళ్లలో దీన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రైల్వే సీనియర్ లైజన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణ వెల్లడించారు.