
చంద్రబాబు ఫొటోతో ఉన్న బస్ టికెట్
- టీఎస్‌ఆర్టీసీకి ఏపీ సీఎం ఫొటో ఉన్న టికెట్ల సరఫరా
- ప్రయాణికుల ఫిర్యాదుతో గుర్తించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో జారీ అవుతున్న టికెట్ల వెనక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో కూడిన ప్రభుత్వ పథకాల ప్రకటనలుండటం అధికారుల్లో గుబులు రేపింది. ఆ టికెట్లు పొందిన కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేయటంతో అధికారులు హడావుడి చేశారు. ఆ టికెట్లు ఏయే డిపోల్లోని బస్సుల్లో ఉన్నాయో తెలుసుకునేందుకు ఏకంగా 3 రోజుల పాటు నానా హైరానా చేశారు.
ఎట్టకేలకు వాటి జాడ కనిపెట్టి అన్నిటినీ ఉపసంహరించుకున్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన టికెట్లు ఒకేచోట ముద్రిస్తారు. దీంతో వాటి సరఫరా సిబ్బంది చేసిన పొరపాటు వల్ల అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కన్నెర్ర చేస్తారోనని అధికారులు ఆందోళనపడ్డారు. చివరికి ఆ టికెట్లు ఉపసంహరించుకున్నాక ఊపిరిపీల్చుకున్నారు. దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టికెట్ ఈష్యూయింగ్ మెషిన్ (టిమ్) ద్వారా టికెట్లు జారీ అవుతున్నాయి. ఆ మెషిన్‌కు అమర్చే పేపర్ రోల్ వెనుక వాణిజ్య ప్రకటనలు, ప్రభుత్వ పథకాల వివరాలను ముద్రిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ పథకాలున్న ఆ టికెట్ రోల్స్ టీఎస్‌ఆర్టీసీకి పొరపాటుగా సరఫరా అయ్యాయి.
వాటిని ఉపసంహరించాం: ఈడీ
ఏపీకి సరఫరా కావాల్సిన టికెట్ రోల్స్ కొన్ని పొరపాటున టీఎస్‌ఆర్టీసీకి చేరాయని ఈడీ ఎం.రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్ జోన్ల పరిధిలోని నాలుగు డిపోలకు ఈ రోల్స్ సరఫరా అయ్యాయని, ఫిర్యాదులు రావడంతో అన్నింటిని పరిశీలించి ఆరు రోల్ బాక్సులను వెనక్కి రప్పించినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ విభజనకు ముందు మే నెలలో వీటిని ముద్రించినట్లు వెల్లడించారు.