సాక్షి, అమరావతి: ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై యాజమాన్యం కాఠిన్యం ప్రదర్శిస్తోంది. ఇకపై ఎవరైనా ఉద్యోగి సర్వీసులో ఉండగా తనువు చాలిస్తే వారి కుటుంబంలో అర్హులకు ఉద్యోగం ఇచ్చే విధానానికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఉత్తర్వులు జారీచేశారు. గత ఆర్టీసీ బోర్డులోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. వివరాల్లోకి వెళ్తే..
విధి నిర్వహణలో ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఆర్టీసీలో 1978 నుంచి కారుణ్య నియామకాల విధానాన్ని అమలుచేస్తున్నారు. అయితే, 1996–2000 మధ్య కాలంలో గతంలో చంద్రబాబు ఆర్టీసీలో కారుణ్య నియామకాలు నిలిపేశారు. ఇప్పుడు కూడా ఆయన హయాంలో ఏకంగా కారుణ్య నియామకాలను రద్దుచేయడం గమనార్హం. కాగా, సంస్థ తీసుకున్న తాజా నిర్ణయం సుమారు 1,500 మందిపై ప్రభావం చూపనుంది. మరోవైపు.. కారుణ్య నియామకాలకు సంబంధించి నిబంధనల పేరుతో వంద మంది మహిళా అభ్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై అక్కడి యాజమాన్యం అడిషనల్ మానిటరీ బెనిఫిట్ స్కీం (ఉద్యోగం ఇవ్వకుండా అదనంగా కొంత మొత్తం ప్రయోజనం కల్పించే విధానం) అమలుచేస్తున్నారని, ఇక్కడ అదే విధానాన్ని అమలుచేస్తున్నట్లు సంస్థ చెబుతున్నప్పటికీ ‘రద్దు’ నిర్ణయాన్ని మాత్రం యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి.
ఏఎంబీలోనూ వివక్ష
కారుణ్య నియామకం లేకుండా అడిషనల్ మానిటరీ బెనిఫిట్ స్కీం (ఏఎంబీ) కింద గతంలో రూ.లక్ష ఇచ్చేవారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం వద్దనుకునే వారికి కొంత మొత్తం ఆర్టీసీ అందించే వీలుంది. 3, 4వ తరగతి ఉద్యోగి అయితే వారి కుటుంబానికి రూ.లక్ష.. రెండో తరగతి అంటే సూపర్‌వైజర్‌గా పనిచేసే ఉద్యోగి కుటుంబానికి రూ.1.25 లక్షలు, ఆఫీసర్ కేడర్ అయితే రూ.1.50 లక్షలు అందేలా ఏర్పాటుచేశారు. అయితే, ఇప్పుడు అన్ని కేడర్‌లకు ఒకే విధంగా రూ.5 లక్షలు అందించే విధంగా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ ఏడాది జూన్ 18 నుంచి అమలులోకి వచ్చేలా ఉత్తర్వులిచ్చారు.
1,500మందికి మొండిచెయ్యి
ఇదిలా ఉంటే.. మూడేళ్లుగా కారుణ్య నియామకాలు కోసం సుమారు 1,500 మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో కొందరు ఉద్యోగం వద్దని.. తమకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలని కాళ్లరిగేలా సంస్థ చుట్టూ తిరుగుతున్నారు. అయితే, వీరికి కేవలం రూ.లక్ష మాత్రమే ఇస్తామని, పెంచిన రూ.5 లక్షలు ప్రయోజనం వీరికి వర్తించదని ఆర్టీసీ తెగేసి చెబుతోంది. అలాగే, ఉద్యోగి చనిపోతేనే కాదు.. మెడికల్‌గా అన్‌ఫిట్ అయిన ఉద్యోగి కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగం ఇస్తామని 2015లో చెప్పిన యాజమాన్యం ఇప్పుడు దాని ఊసెత్తడంలేదు. దీంతో 200మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పైగా ప్రభుత్వం అనుమతించిన కేడర్ పోస్టుల కంటే అదనంగా నియామకాలు చేస్తున్నారు. ఈడీలు మొదలుకుని ఆర్‌ఎంలు, డీవీఎంల కేడర్‌లలోనూ అధికంగా సిబ్బందిని నియమించుకున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బందిని ఈ విధంగా నియమించుకుని ఆర్టీసీకి నష్టాలొస్తున్నాయని చెబుతూ కారుణ్య నియామకాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం: యూనియన్ నేతలు
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు రద్దుచేస్తూ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఎన్‌ఎంయూ, ఈయూ నేతలు రాజారెడ్డి, చంద్రయ్య, దామోదరరావులు తెలిపారు. కారుణ్య నియామకం వద్దనుకునే వారికి ఏఎంబీ కింద రూ.10 లక్షలు అందించాలని వారు డిమాండ్ చేశారు.
ఆర్టీసీలో కారుణ్యం రద్దు
Published Sat, Jul 7 2018 2:53 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment