
సాక్షి, పుంగనూరు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 53వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం సదుంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
‘మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. నాలుగేళ్ల పాటు పింఛన్లు ఇవ్వకుండా అన్యాయం చేసిన ఈ వ్యక్తికి ఇప్పుడు జ్ఞానోదయం అయింది. పింఛన్లు ఇవ్వడం లేదన్న విషయం ఇప్పుడే తెలిసిందని డ్రామాలు ఆడుతున్నారు. నాలుగేళ్లలో ఏ ఒక్క హామీని అమలు చేయని వ్యక్తి తనకు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని చెప్పడం దుర్మార్గం. చిత్తూరు జిల్లాకు చంద్రగ్రహణం పట్టుకుని, అభివృద్ధి ఆగిపోయింది. నాలుగేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు. ఏమీ చేయకుండానే నాకు ఓటు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని చంద్రబాబు అంటున్నారు. ఆయన మాటలు చూస్తే కళ్లు నెత్తికెక్కినట్లున్నాయి.
ఓటు వేయకుంటే ప్రజలు సిగ్గుపడాలా?. ఏమీ చేయకుండా ఓట్లు అడుగుతున్న చంద్రబాబు సిగ్గుపడాలా?. ఏం చేశాడని చంద్రబాబుకు ఓట్లు వేయాలి. మూడుసార్ల కరెంట్, బస్సు ఛార్జీలను పెంచిన ఘనత చంద్రబాబుది. అలాంటి చంద్రబాబుకు ఓట్లు వేయాలా? రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, నిరుద్యోగ భృతి ఇస్తామని, మాట తప్పినందుకు ఓట్లు వేయాలా?. ఎన్నికల సమయంలో పదేళ్లు కాదు...పదిహేనేళ్లు హోదా కావాలన్నారు. ఎన్నికలు రాగానే హోదాను మర్చిపోయారు.
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి హోదాను అమ్మేసినందుకు ఓట్లు వేయాలా?. జన్మబూమి కమిటీల పేరుతో మఫియాను ప్రోత్సహిస్తున్నారు. 35 పడకల ఆస్పత్రికి ఎమ్మల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 11 ఎకరాల సొంత భూమి ఇచ్చారు. ఆ స్థలంలో ఆస్పత్రిని కట్టడం లేదు. ఆ భూమిని తిరిగి ఇవ్వడం లేదు. ఆ భూమి ఇస్తే ఆస్పత్రి కట్టడానికి మేం సిద్ధం. పుంగనూరులో ఆర్టీసీ డిపో కట్టి ఏడున్నరేళ్లు అయినా బస్సులు ఇవ్వలేదు. ఇంత అన్యాయమైన పాలన ఎక్కడా ఉండదు. పార్టీ అధికారంలోకి రాగానే ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. ఆర్టీసీని బ్రహ్మాండంగా నడిపిస్తాం.
హంద్రీ-నీవా నీటిని పుంగనూరుకు తీసుకొచ్చి అన్ని చెరువులను నింపి గ్రామాలను సస్యశ్యామలం చేస్తాం. పేదలందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తాం. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తాం. రూ.1000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీలో చేరుస్తాం. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి విశ్రాంతి అవసరం అయితే ఆరు నెలల పాటు డబ్బులిస్తాం. వైద్యం కోసం పేదలను అప్పులపాలు కానివ్వం. అందరికీ కార్పొరేట్ వైద్యం అందిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పేదలకు రూ.10వేల పెన్షన్ ఇస్తాం. నాన్న ఒక్క అడుగు ముందుకేశాడు. నేను రెండడుగులు ముందుకేస్తా. పేద ప్రజలకు అండగా నిలుస్తా.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment