డుంబ్రిగుడ, న్యూస్‌లైన్ : ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ సేవలు మెరుగుపర్చేందు కు చర్యలు తీసుకుంటున్నామని విజయనగరం ఆర్టీసీ డివిజన్ రీజనల్ మేనేజర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని కించుమండ గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించి ఆర్టీసీ సేవలపై గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తమ డివిజన్ పరిధిలో ఉన్న 10 ఆర్టీసీ డిపోల ద్వారా పలు మారుమూల ప్రాంతాల కు బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రధానంగా ఎస్.కోట డిపో నుంచి విశాఖ ఏజెన్సీలోని అరకు, కించుమండ ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు.
విశాఖ నుంచి కించుమండకు రోజూ 14 బస్సుల ద్వారా 28 సర్వీసులు నడుపుతున్నామన్నారు. ప్రస్తుతం తిప్పుతున్న పల్లె వెలుగు సర్వీసులతో పాటు లగ్జరీ బస్సులను కూడా నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్టీసీ సేవలను వివరించేందుకు ఈ నెల 11న కించుమండలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయనున్న ట్టు తెలిపారు. వనితా, క్యాట్‌ల గురించి అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులకు ఉచిత బస్సు పాస్‌లను అందజేస్తామని చెప్పా రు. కించుమండ గ్రామంలో నైట్‌హాల్ట్ ఉండే బస్సులను అత్యవసర సమయాల్లో డిపో మేనేజర్‌కు సమాచారం అందించి 108 వాహనం మాదిరిగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.కోట డిపో మేనేజర్ వి.శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు.