కాల్‌మనీ రాకెట్ అనంతలోనూ కోరలు చాచింది. ఓ ఏఆర్ కానిస్టేబుల్ వడ్డీ దందాను భరించలేక టీచర్ల దంపతులు న్యాయం చేయాలంటూ మీడియాకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పట్టణానికి చెందిన నాగరాజు, అతని భార్య టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరు ఏఆర్ కానిస్టేబుల్ అయిన సుధాకర్ నుంచి 2009లో రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నారు. వడ్డీ కింద రూ.5 లక్షలు చెల్లించారు.
అయినా అప్పు తీరలేదు. శాలరీ అటాచ్‌మెంట్‌తో సుధాకర్ మరో రూ.85వేలు వడ్డీ గుంజాడు. మొత్తం రూ.6 లక్షలు వడ్డీ కిందే చెల్లించామని, ఇక అసలు కట్టలేమని నాగరాజు దంపతులు తేల్చి చెప్పారు. దీంతో సుధాకర్ మరికొంత మంది పోలీసులతో కలసి మూడు నెలల క్రితం బాధితుడి ఇంటికి వెళ్లి బెదిరించాడు.
విషయం జిల్లా ఎస్పీకి తెలియడంతో టూటౌన్‌కు కేసు అటాచ్ చేశారు. దీనిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా, మరోవైపు సుధాకర్ రెండు రోజులుగా నాగరాజు దంపతులపై అప్పు విషయమై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. దీంతో తమకు న్యాయం చేయాలని నాగరాజు దంపతులు మీడియా ముందు వాపోయారు.