
‘ఓరి భగవంతుడా .. ఎంత పని చేశావు.. రాత్రి ఫోన్‌లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే తమ కుమారుడు ప్రాణాలు విడిచాడని అధికారుల నుంచి ఫోన్ రావడం ఏంటి...! తాము వచ్చి చూడగానే రక్తపు మరకలతో పడి వుండటం ఏంటి’ అంటూ ఏఆర్ కానిస్టేబుల్ తల్లిదండ్రులు బోరున విలపిస్తూ రిమ్స్ మార్చురీ వద్ద శనివారం ఉదయం కనిపించారు. కానిస్టేబుల్ భార్య అరుణ రోదిస్తూ, కుమారులు ఇద్దరూ తన తండ్రి మరణించాడనే విషయం అర్థం గాక అమాయకంగా అవ్వ, తాత వంక చూస్తున్నారు. ఈ సంఘటన అక్కడున్న వారి హృదయాలను కలచి వేసింది.
కడప అర్బన్ : జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రధాన ద్వారం వద్ద సెంట్రీ విధుల్లో వున్న ఏఆర్ కానిస్టే బుల్ పెద్దశెట్టి వెంకటకిరణ్ (28) (ఏఆర్ పీసీ నంబర్ 2402).. తాను ధరించిన తుపాకీ 303 ప్రమాదవశాత్తు పేలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటకిరణ్‌ది 2009 బ్యాచ్. ఆయన తల్లిదండ్రులు పెద్దిశెట్టి వెంకటేశ్వర్లు, పద్మావతమ్మ. ముగ్గురు అక్కలు శ్రీదేవి, సుభాషిణి, భాగ్యలక్ష్మి ఉన్నారు. వెంకటకిరణ్‌కు భార్య అరుణ, కుమారులు వెంకట కైలాస్ (6), వెంకట భువనేష్ (4) ఉన్నారు. పోలీస్ క్వార్టర్స్‌లోనే కుటుంబ సభ్యులతో కలిసి నివాసం వుండే వాడు.
ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 వరకు వుండే ప్రధాన ద్వారం సెంట్రీ షిప్ట్ డ్యూటీకి వచ్చాడు. వచ్చిన తర్వాత 12:45 గంటల ప్రాంతంలో తుపాకీ పేలడంతో.. అక్కడే విశ్రాంతి గదిలో వున్న సహచర సిబ్బంది వచ్చి చూసేలోపు కానిస్టేబుల్ రక్తపు మడుగులో పడి వున్నాడు. వెంటనే అధికారులు, సిబ్బం ది కలిసి రిమ్స్‌కు వైద్యం కోసం తరలించారు. అప్పటికే మృతి చెందాడని రిమ్స్ వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆ సమయంలో జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ, కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ, రిమ్స్ సీఐ పురుషోత్తంరాజు తమ సిబ్బందితో కలిసి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు.
పోలీసు లాంఛనాలతో నివాళి: వెంకటకిరణ్ మృతదేహాన్ని రిమ్స్‌లో జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడతోపాటు అధికారులు పరిశీలించారు. తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పోస్టుమార్టం అనంతరం పోలీస్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ నివసించిన ఇంటి వద్ద పోలీసు లాంఛనాలతో తుపాకులను గాల్లోకి పేల్చి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ ఎ.శ్రీనివాసరెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ రుషికేశవ్‌రెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ మురళీధర్, ఆర్‌ఐలు విజయకుమార్, చంద్రశేఖర్, నాగభూషణం, సిబ్బంది, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీస్ లైన్‌లోని వారు పాల్గొన్నారు.
పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నేతల సంతాపం
పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అగ్రహారం శ్రీనివాస శర్మ, కడప తాలూకా ఎస్‌ఐ, కార్యదర్శి ఎన్.రాజరాజేశ్వరరెడ్డి, పెండ్లిమర్రి ఎస్‌ఐ ఎస్‌కె.రోషన్ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రిమ్స్ మార్చురీలో కానిస్టేబుల్ మృతదేహాన్ని వారు పరిశీలించారు. సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం నుంచి కానిస్టేబుల్ కుటుంబానికి రావాల్సిన తక్షణ సహాయాలను వారికి అందేలా చూస్తామన్నారు.
పోలీసులు ఏమన్నారంటే..
ఈ సంఘటనపై కడప వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా పోలీసు కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద సెంట్రీ విధుల్లో వున్న ఏఆర్ కానిస్టేబుల్ వెంకటకిరణ్ శనివారం తెల్లవారుజామున 12:45 తుపాకీ పేలడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తమకు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే రిమ్స్‌కు తరలించామని, అప్పడికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment