సాక్షి, నెల్లూరు: ఆధిపత్యానికి గండి పడుతోందనే ఆందోళనతో సమైక్య ఉద్యమంలో ఆనం సోదరులు చిచ్చు పెడుతున్నారా..? ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా..? విద్యార్థి జేఏసీ నేత జీవీ ప్రసాద్‌పై దాడి అందులో భాగమేనా..? నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నారా..? ప్రస్తుతం నెల్లూరులో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించిన వారు ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం ఇస్తున్నారు.
సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ జీవీ ప్రసాద్‌పై ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ముజీర్ రోజ్‌దార్ తన అనుచరులతో గురువారం దాడికి పాల్పడ్డారు. దాడి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముజీర్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అనుచరుడనే విషయంలో నెల్లూరులో అందరికీ తెలిసిన విషయమే. ముజీర్‌పై ఇప్పటికే నగరంలోని పలు పోలీస్టుస్టేషన్లలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆనం వారి అండతో ముజీర్ పేట్రేగిపోతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం పోలీసులకు తెలియంది కాదు. ముజీర్‌తో పాటు అతని సహచరులు ఆనం వివేకానందరెడ్డి అనుచరులు కావడంతోనే పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆధిపత్యంపై ఆందోళన
జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రాజకీయాలకతీతంగా ఉధృతంగా సాగుతోంది. తమ ప్రమేయం లేకుండానే ఉద్యమం జోరుగా సాగుతుండటం, ప్రజలందరూ మమేకమవడం ఆనం సోదరులను ఆందోళనకు గురి చేస్తోంది. తమ ఆధిపత్యానికి గండి పడిం దనే భావనలో వారు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వారిని ఉద్యమంలోకి రావాలని జేఏసీ నేతలు పలు దఫాలు పిలుపునిచ్చారు. రాజీనామాలు చేయలేదని మంత్రి ఆనం ఇంటి ముట్టడికి యత్నించారు.
అయితే ‘నెల్లూరులో మేము లేకుండా ఉద్యమం జరగడమే సాహసమైతే..మళ్లీ మమ్మల్నే నిలదీయడమా..! ఇలా అయితే అందరికీ చులకన కామా..’ అని ఆనం సోదరులు అనుకుని ఉద్యమంలో చు రుగ్గా వ్యవహరిస్తున్న తనపై దాడి చేయిం చారని జీవీ ప్రసాద్ ఆరోపిస్తున్నాడు. సమైక్యవాదులపై భౌతికదాడులకు దిగడం ఎంతమాత్రం తగదని సమైక్య రాష్ట్ర పరిరక్షణ కమిటీ నేతలు గళమెత్తారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని సాక్షాత్తు వారి సోదరుడైన ఆనం జయకుమార్‌రెడ్డి బహిరంగంగా విమర్శించారు. ఇలాంటి దాడులు సమైక్య ఉద్యమానికి విఘాతం కలిగిస్తాయని, సోదరుల వైఖరిని ఆయన ఖండించారు. సమైక్యవాదులపై దాడిని జిల్లా వాసులందరూ ఖండిస్తున్నారు.
ఉద్యమంలో
నామమాత్ర పాత్ర..
రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేసినప్పటి నుంచి నెల్లూరులో సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అనే తేడా లేకుండా అందరూ ఉద్యమబాటపట్టారు. అయితే ఆనం సోదరుల వైఖరి మాత్రం భిన్నంగా ఉంది. ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అప్పుడప్పుడూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ప్రకటనలు గుప్పిస్తున్నా, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాత్రం పూర్తిగా దూరంగా ఉన్నారు. విభజనకు వ్యతిరేకంగా పదవికి రాజీనామా చేయనని ఆయన స్పష్టం చేశారు.
వినాయక చవితి పండుగకు నెల్లూరుకు వచ్చినా ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల వరకు సమైక్యాంధ్ర ఉద్యమమంటే తామే అన్నట్టుగా వ్యవహరించిన ఆనం సోదరులు, తీరా ఉద్యమం మొదలయ్యాక అస్త్ర సన్యాసం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ఉద్యమం తీవ్రంగా జరుగుతుంటే మంత్రి, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరుకావడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు ఇప్పటికే జిల్లాలోని వైఎస్సార్‌సీపీ, టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమదైన రీతిలో నిరసన తెలిపారు. ఊరంతా ఒకదాైరె తే ఉలిపికట్టెది ఓ దారి అన్న చందాన ఆనం సోదరులు వ్యవహరిస్తుండటం జిల్లా వాసులకు ఆగ్రహం తెప్పిస్తోంది.