
అక్షయపాత్ర, మంత్రదండం లేవు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 40 రోజుల్లోనే నేరవేర్చాలంటే తమ వద్ద అక్షయపాత్ర, మంత్రదండాలు లేవని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
40 రోజుల్లో హామీలన్నీ నెరవేరాలంటే ఎలా?
5 ఎకరాల లోపు రైతులకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు
భూసార పరీక్షలకు ప్రాధాన్యం
గుంటూరు : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 40 రోజుల్లోనే నేరవేర్చాలంటే తమ వద్ద అక్షయపాత్ర, మంత్రదండాలు లేవని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఆయన ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. వ్యవసాయ రుణాల మాఫీ అసాధ్యమని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అంటున్నారని, సాధ్యమని మేమంటున్నామని, దాన్ని చూసి ఆయన తట్టుకోలేకపోతున్నారన్నారు. 40 రోజుల్లోనే ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీకి 168 సీట్లు వస్తాయంటున్నారని, ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న ఎమ్మొల్యేలనే కాపాడుకొనే శక్తి వారికి లేదన్నారు. చంద్రబాబు 40 రోజుల్లోనే పాలనను గాడిలో పెట్టారని, విద్యుత్ కోతలు తగ్గించారని తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రైతు రుణమాఫీపై తగ్గబోమని, త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పారు. ఐదేళ్లలో అన్ని హామీలను నెరవేరుస్తామని, కాంగ్రెస్, వైస్సార్‌సీపీలు నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి వస్తుందన్నారు.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళిక
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా పడ్డం దున, ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని, రైతుల్లో చైతన్యం కోసం ప్రత్యేక శిక్షణ తరగుతులు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం మరో నాలుగు కృషి విజ్ఞాన కేంద్రాలను కేటాయించిందన్నారు. పంట దిగుబడి పెరగడానికి ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహించి ఏ పోషక పదార్థం లోపిస్తే దాన్ని వంద శాతం సబ్సిడీ తో రైతుకు అందించే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్లు ఖర్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తంచేశారన్నారు. భూసార పరీక్షలు, పోషకాలకు కేంద్రాన్ని రూ.500 కోట్లు అడిగామని, కొంత మేర సహాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు వ్యవసాయాధారిత, అనుబంధ పరిశ్రమలు ఎగుమతులను ప్రొత్సహిస్తామన్నారు. వ్యవసాయ యూనివర్సిటీని గుంటూరులోని లాంఫామ్‌లోనే ఏర్పాటు చేస్తామన్నారు. దీని కోసం కేంద్రం రూ. 50 కోట్లు కేటాయించిందన్నారు. డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రొత్సహిస్తామన్నారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు వంద శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు సమకూరుస్తామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే ఇందుకోసం కేంద్రం నుంచే రూ. 340 కోట్లు వస్తాయనీ, దీనికి మరికొన్ని నిధులు కలిపి దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. చేపల ఉత్పత్తిలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నందున, హైదరాబాద్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు తరహాలో రాష్ట్రంలో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిపారు.