
మళ్లీ అదే చెబుతున్నా: నన్నపనేని
అరసవిల్లి (శ్రీకాకుళం): ఆత్మ, మాన రక్షణ కోసం మహిళలు రోకలి బండైనా, కత్తినైనా ఆయుధంగా చేసుకొని మృగాళ్లను ఎదిరించాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సూచించారు. శ్రీకాకు ళంలో గురువారం ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకీ అత్యాచారాలు పెరిగి పోతున్నాయని, వీటిని నియంత్రించేందుకు అన్ని విధాలు గా తమ కమిషన్ చర్యలు చేపడుతోందన్నారు.
గతంలో తాను మహిళలకు కత్తులు వెంటబెట్టుకొని వెళ్లండని చెప్పడంపై కొందరు విమర్శలు గుప్పించారని, అయినా తాను మళ్లీ అదే విషయాన్ని గట్టిగా చెబుతున్నానన్నారు. ప్రస్తుతం అన్ని వర్గాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌లపై నియంత్రణ అవసరం అని, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. ఇక సినిమాల్లో లాగానే టీవీ సీరియళ్లకూ సెన్సార్ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇక రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల చింతపల్లి ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేశారని, మరో ఇద్దరిని కూడా వెంటాడుతామని స్పష్టం చేశారు.