పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతానికి అధికారులు, క్షేత్ర సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని జా యింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సూచించారు.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతానికి అధికారులు, క్షేత్ర సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని జా యింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. జేసీ క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమం సమన్వయ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు ఎక్కువ బాధ్యత వహించాలని తెలిపారు. హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి ఇంటింటా తిరిగి పోలి యో చుక్కలు వేయాలని ఆదేశించారు.
అంతకు ముందు డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్యామలదేవి పోలియో చుక్కల కార్యక్రమ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లను జేసీకి వివరించారు. జిల్లాలో అయిదేళ్లలోపు 4,26,213 మంది చిన్నారులను గుర్తించామని తెలిపారు. 14,486 మంది వేక్సినేటర్లు, 367 మంది సూపర్‌వైజర్లు, 102 మొబైల్ టీమ్ లు ఈ కార్యక్రమంలో పనిచేస్తున్నారని తెలిపారు. 23న ఆదివారం కావడంతో ఆ రోజు పాఠశాలలను తెరిచి ఉంచాలని కోరామని, ఉపాధ్యాయుల సహకారం కూడా తీసుకుంటున్నామన్నారు.
రైల్వేస్టేషన్లు, బస్‌కాంప్లెక్సులు, జిల్లాలో ఆ రోజు జరిగే జాతర, సంతల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీఈఓ లింగేశ్వరరెడ్డి, జీవీఎంసీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీమోహన్, వైద్య ఆరోగ్య శాఖ ఆర్‌డీ డాక్టర్ సోమరాజు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వసుంధర, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ కె.విజయలక్ష్మి, ఆర్టీసీ అధికారి కె.వి.వి.ప్రసాద్ పాల్గొన్నారు.
విదేశాలకు వెళ్లి వచ్చేవారికి ప్రత్యేక వ్యాక్సీన్లు
విశాఖపట్నం : విదేశాలకు తరచుగా రాకపోకలు సాగించే ప్రయాణికుల పిల్లలకు ప్రత్యేక పోలియో వ్యాక్సీన్‌ను తప్పని సరిగా వేయించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా, సోమాలియా, కెన్యా, సిరియా, ఇథియోపియా దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల పిల్లల కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ప్రకటించారు. పెదవాల్తేరులోని పోలమాంబ గుడి ఎదురుగా ఉన్న జిల్లా కోల్డ్ ఛైన్ కాంప్లెక్స్‌లో ఈ కేంద్రం ఉంటుందన్నారు.