నేనున్నానంటూ... భరోసా
►నేడు జిల్లాకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాక
►రెండు రోజులపాటు నియోజకవర్గాల వారీగా పార్టీపై సమీక్ష
►వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపేయత్నం
వేదిక : గుంటూరు- అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్
సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపడంతోపాటు, పార్టీ పరిస్థితులను సమీక్షించేందుకు ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గుంటూరు రానున్నారు. అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో రెండు రోజులపాటు నియోజక వర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. ప్రధానంగా స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలపై సమీక్ష జరుగుతుంది.
►పూర్తిస్థాయిలో నియోజకవర్గ నేతలతో సమీక్షించి శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
►ఎన్నికల సమయంలో జరిగిన లోటుపాట్లు తెలుసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నారు.
►పార్టీ పటిష్టత కోసం అవసరమైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, బాధ్యతలు, కమిటీల ఏర్పాటు, విధివిధానాలను చర్చిస్తారు.
►పార్టీ కార్యకర్తలు, నాయకుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తారు.
►ఎన్నికల ఫలితాల తరువాత అధికార పార్టీ నేతలు చేస్తున్న దాడులు, వేధింపులకు సంబంధించి పార్టీ శ్రేణులు ఐధైర్యపడాల్సిన పని లేదని, మీకు అండగా ఉంటాననే భరోసాను జగన్ ఈ సమీక్ష సమావేశాల ద్వారా కార్యకర్తలకు కల్పించనున్నారు.
►ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు విధానలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ప్రజలతో పార్టీ కార్యకర్తలు మమేకం కావాలని ఆయన సూచించనున్నారు.
►రుణమాఫీ అమలు తీరుకు వ్యతిరేకంగా నరకాసురవధ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిర్వహించిన విషయం విధితమే.
► ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించేందుకు కార్యకర్తలు, నాయకులు గ్రామాల బాట పట్టాలని జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
►రెండు రోజుల సమీక్ష అనంతరం, ఆగస్టు రెండో తేదీ ఉదయం జగన్ హైదరాబాద్ వెళతారు.
► ఈ సమీక్షలకు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, శాసనసభ్యులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులతోపాటు జిల్లా, నియోజక వర్గాల పరిధిలోని అన్ని విభాగాల నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర పాలక మండలి సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరు కావాలని జిల్లా, నగర పార్టీ అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి కోరారు.