రాష్ట్రంలో అన్ని కులాల మాదిరిగా ఆర్యవైశ్యులలోని పేదలకు చేయూతనిచ్చేందుకు రూ. వెయ్యి కోట్లతో ....
సత్తెనపల్లి (గుంటూరు): రాష్ట్రంలో అన్ని కులాల మాదిరిగా ఆర్యవైశ్యులలోని పేదలకు చేయూతనిచ్చేందుకు రూ. వెయ్యి కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ ఏర్పాటు అంశంపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే శాసనసభ్యులకు వినతి పత్రాలను అందించామన్నారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆర్యవైశ్యులతో చర్చించి రాజకీయంగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆమేరకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరారు.
ప్రధానంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌లు, ఖాదీబోర్డు చైర్మన్‌లను ఆర్యవైశ్యులకు కేటాయిస్తే తద్వార గ్రంథాలయాలను అభివృద్ధి పరచడం, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసి వ్యాపారాలను వృద్ధి చేస్తామన్నారు. రోజూ ఆర్యవైశ్యులు వ్యాపారాల ద్వారా రూ. 365 కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నారని తెలిపారు. నీతి, నిజాయితీగా చేసే వ్యాపారులపై చట్టాల పేరుతో ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదన్నారు. రూ.20 కోట్లతో విజయవాడలో వాసవి హాస్పటల్ వసతి గృహం, ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం నిర్మించబోతున్నట్లు ఆయన చెప్పారు